వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలో మరో కోణం కూడా ఉందని ఆయన ట్వీట్ చదివితే అర్థమవుతోంది. విజయసాయిరెడ్డి వైసీపీలో కీలక నాయకుడు. ఆయనెప్పుడూ సీరియస్ రాజకీయాలే చేస్తుంటారు. ఏడాది క్రితం ప్రత్యర్థులపై ఆయన ట్వీట్లు చూస్తే… అమ్మో ఇంత ఘాటుగానా అనే అభిప్రాయం కలిగేది. ఇప్పుడేమో ఆయన ట్విటర్ వేదికగా కామెడీ పండిస్తున్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
తాజాగా ఆయన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఆ ట్వీట్ సంగతేంటో చూద్దాం.
“2024 ఏపీ ఎన్నికల్లో మహా జఠిలమైన పోటీ అంతా రెండో స్థానానికే అనిపిస్తోంది. ఇప్పటిదాకా నమ్మకంగా టీడీపీతో నిలిచిన వర్గాలు జనసేన వైపూ, అలాగే జనసేనకు అనుకూలంగా వుండే ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి అంతర్గతంగా కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 51 శాతం ఓట్ల షేర్‌తో గెల్చుకునే పరిస్థితి ఉండడంతో ఏపీలో ప్రతిపక్షాలు 2024 వదిలేసి 2029కి సన్నద్ధం కావాలేమో!”
వైసీపీ ముఖ్య నాయకుడిగా పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరిచేందుకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేసి వుంటారు. కానీ వాస్తవ పరిస్థితి వైసీపీకి రాజకీయంగా వారు అంచనా వేసుకున్నట్టుగా అనుకూలంగా లేదు. ఏపీలో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఖచ్చితంగా చెప్పలేని దుస్థితి. అధికార పార్టీ వైసీపీపై కావాల్సినంత వ్యతిరేకత వుంది. అయితే పొత్తులపై అధికారం ఎవరనేది ఆధార పడి వుంటుందని విశ్లేషకుల మాట.
బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని, పవన్ కల్యాణ్ పార్టీ తక్కువ సీట్లలో పోటీ చేస్తే ఆ కూటమికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన ఎక్కువ సీట్లలో అంటే 50కి తక్కువ కాకుండా పోటీ చేస్తే మాత్రం వైసీపీకి లాభం. ఒకవేళ బీజేపీ, జనసేన మధ్య మాత్రమే పొత్తు వుంటే వైసీపీకి రాజకీయ ప్రయోజనం. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం, ఇక ఆ పార్టీని శాశ్వతంగా మరిచిపోవచ్చు. ఈ నేపథ్యంలో పొత్తుల అంశాన్ని ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి ఏకంగా 51 శాతం ఓట్ షేరింగ్‌తో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ట్వీట్ చేయడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. విజయసాయిరెడ్డి కామెడీ యాంగిల్ కూడా ఉందే అని వెటకరిస్తున్నారు.