ఇప్పటికి ఏడేళ్ల క్రితం అమరావతి రాజధాని భూమి పూజకు ప్రధాని ఏపీకి వచ్చారు ఆ తరువాత ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ఏవీ ప్రధాని మోడీ ప్రారంభించలేదు. సరిగ్గా ఒక వైపు విశాఖ రాజధాని అంశం హోరెత్తున్న వేళ, విశాఖను అన్ని రకాలుగా ముందు వరసలో ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వేళ ఇపుడు ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ వస్తున్నారు
ముఖ్యమంత్రి జగన్ తో కలసి విశాఖ వేదికగా చేసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నవంబర్ 12న ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఇదే సందర్భంలో విశాఖ సహా ఉత్తరాంధ్రా వాసుల కల అయిన రైల్వే జోన్ ఎట్టకేలకు సాకారం అవుతోంది. విశాఖ రైలే స్టేషన్ ఆధునీకరణ పనులకు 446 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తారు. 26 వేల కోట్లతో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
260 కోట్లతో నిర్మించిన రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ ని ప్రధాని జాతికి అంకితం చేస్తారు. విశాఖ లో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని 120 కోట్ల రూపాయాలతో ప్రధాని నరెంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. భీమిలీ నియోజకవర్గం గంభీరం వద్ద 445 కోట్ల రూపాయలతో ఐఐఎం భవనానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
ఈ సందర్బంగా ప్రధాని మోడీ జగన్ కలసి విశాఖలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రిగా జగన్ ఉండగా ఏపీలో అందునా విశాఖలో వేల కోట్లతో చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభించడం విశేషం. విశాఖ రాజధాని అని వైసీపీ ప్రతిపాదిస్తున్న వేళ దీనిని శుభసూచకంగా భావిస్తున్నారు. వైసీపీకి రాజకీయంగా నైతికంగా ఇది మంచి బలాన్ని అందించే సందర్బంగా పేర్కొంటున్నారు.