విశాఖ రాజధాని అంటే విపక్షం కస్సుమని లేస్తోంది. అంతే కాదు, అసలు రాజధానిగా ఆ ప్రాంతం ఉండేందుకే పనికిరాదు అన్నట్లుగా మాట్లాడుతారు. అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ జనసేన సహా విపక్షాలు మద్దతు ప్రకటించాయి. పవన్ అయితే మూడు రాజధానులు ఎందుకు ఏపీలో అన్ని జిల్లాలను రాష్ట్రాలుగా చేసేస్తే పోలా అని సెటైర్లు వేస్తున్నారు.
అయితే పవన్ మాటలకు ధీటైన కౌంటర్ ఇచ్చేది యువ మంత్రి గుడివాడ అమరనాధ్ మాత్రమే. ఆయన పవన్ కి విశాఖ అంటే ఎందుకని కక్ష అని ప్రశ్నించారు. పవన్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విశాఖ ఎంత చేసిందో అర్ధమవుతుంది అని చెప్పుకొచ్చారు. విశాఖలోనే పవన్ తన నటనకు సంబంధించి ఓనమాలు నేర్చుకున్నారని అన్నారు. విశాఖకు చెందిన అమ్మాయినే ఆయన వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు.
ఏపీలో ఇరవై ఆరు జిల్లాలు ఉంటే పాతిక జిల్లాలు అని పవన్ అనడాన్ని కూడా సెటైరికల్ గా గుడివాడ తప్పు పట్టారు. బాబూ కళ్యాణ్ ఏపీలో ఎన్ని జిల్లాలో తెలుసుకో అని కామెంట్స్ చేశారు. విశాఖ రాజధాని పవన్ కి ఇష్టం ఉందా లేదా చెప్పకుండా మిగిలిన మాటలు ఎందుకు అని మరో మంత్రి కొట్టు సత్యనారాయణ అంటున్నారు.
పవన్ కి విశాఖ మీద ఇపుడు కక్ష ఎందుకు అంటే ఆయన గాజువాక నుంచి పోటీ చేస్తే ఓడించారన్న ఆగ్రహమే కారణం అని వైసీపీ మంత్రులు అంటున్నారు. విశాఖ రాజధానిని పవన్ విమర్శించడం వెనక ఆయన రాజకీయ ఓటమి బాధ ఉందని అంటున్నారు. మరి అది నిజమేనా జనసేన నాయకులు పవన్ దీనికి ఏమంటారో కదా.