“విశాఖ గర్జన” అనంతరం విశాఖలో అనూహ్యంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఆ పరిస్థితులు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. జనసేన కార్యకర్తల వైఖరికి నిరసనగా ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
పవన్‌కల్యాణ్ నిర్వహించతలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన వారంతా పోర్ట్ కళావాణి స్టేడియం వద్దకు చేరుకున్నారు. అక్కడే జనవాణిని నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
పవన్‌కల్యాణ్ ఉత్తరాంధ్ర ద్రోహి అని రాసిన ప్లకార్డులతో ఆందోళనకారులు ధర్నాకు దిగారు. జనసేన కార్యకర్తలు ఆకతాయి చేష్టలకు పాల్పడ్డారని మండిపడ్డారు. విశాఖ గర్జన విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక జనసేన కార్యకర్తలు విమానాశ్రయంలో వీరంగం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు రాజధాని వస్తే పవన్‌కు అభ్యంతరం ఏంటని వారు నిలదీశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి నిరోధకుడిగా పవన్‌కల్యాణ్ తయారయ్యారని విమర్శించారు.
ఇలాగైతే పవన్‌కల్యాణ్‌ను ఉత్తరాంధ్రలో ఏ కార్యక్రమాన్ని నిర్వహించనివ్వమని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర జేఏసీ పేరుతో ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేనాని జనవాణి నిర్వహించే సమయం ఆసన్నం కావడంతో అక్కడి నుంచి నిరసనకారులను తరలించేందుకు పోలీసులు ప్రయాస పడాల్సి వచ్చింది.