ఎటు చూసినా రౌడీస్ బాగా పెరిగిపోతున్నారు. వారి సంఖ్య కూడా సాధారణ జనాభాతో పోటీ పడుతోంది. విశాఖ లాంటి డెవలప్మెంట్ సిటీలో 450 మంది దాకా రౌడీ షీటర్లు ఉన్నారని పోలీసుల లెక్కలు తెలియచేస్తున్నారు. ఇందులో వందమందికి పైగా రౌడీస్ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారని కూడా చెబుతున్నారు.
ఇటీవల కాలంలో విశాఖలో మర్డర్స్ పెరిగాయి. అలాగే అసాంఘిక కార్యకలాపాలు జోరందుకున్నాయి. వీటి వెనక రౌడీ షీటర్లు ఉన్నారని పోలీసులు భావించి టోటల్ నంబర్ ని దగ్గర పెట్టుకుని వారిని స్టేషన్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
మీరు జాగ్రత్తగా ఉండకపోతే జైలే గతి అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. విశాఖ సిటీలో గంజాయి స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల అక్రమరవాణా, సారాయి ఎగుమతులు, దిగుమతులు చేస్తూ రౌడీ షీటర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. వీరి వెనక పెద్దలు కూడా ఉన్నారని పొలీస్ విచారణలో తెలిసిన భోగట్టా. దాంతో వారికి పూర్తిగా చెక్ పెట్టడానికి పోలీస్ యంత్రాంగం మొత్తం అలెర్ట్ అయింది.
మంచిగా చెబితే వినకపోతే అరెస్టులు చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రతీ స్టేషన్ లో కనీసం ఇద్దరు రౌడీ షీటర్లను కటకటాల వెనక్కి నెట్టడం ద్వారా మిగిలిన వారిలో భయం పుట్టించాలని టాస్క్ ఫోర్స్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. విశాఖలో పెరిగిన రౌడీ షీటర్ల నంబర్ ని తగ్గించేందుకు వారిలో పరివర్తన కలిగించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లుగా పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
విశాఖ ఒక వైపు అభివృద్ధి చెందుతూంటే రౌడీ షీటర్లు కూడా వందల్లో పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.