అవును అక్కడ ఏ రకమైన డౌట్లూ పెట్టుకోకుండా కళ్ళు మూసుకుని తినేయవచ్చు. అక్కడికి వెళ్తే హాయిగా నచ్చిన ఫుడ్డు తింటూ తెగ ఎంజాయ్ చేయవచ్చు. అవును ఇంత ధీమాగా ఎందుకు చెబుతున్నారూ అంటే అక్కడ అహార పదార్ధాలకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది కనుక. అలా విశాఖ రైల్వే స్టేషన్ కి ఈ రకమైన గుర్తింపును ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చింది.
అంటే ఈట్ రైట్ స్టేషన్గా గుర్తిస్తూ ఫోర్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చేసింది అన్న మాట. విశాఖ రైల్వే స్టేషన్ కి వెళ్లేవారు అంతా చాలా హ్యాపీగా ధీమాగా ఇక్కడ రెస్టారెంట్లలో ఆహారపదార్ధాలు తినేయవచ్చు అంటున్నారు. ఇంతకీ విశాఖ రైల్వే స్టేషన్ చేసిన పుణ్యమేంటి అంటే అది పుణ్యం కాదు పరిశుభ్రతా ప్రమాణాలు తుచ తప్పకుండా పాటించడం అని రైల్వే అధికారులు అంటున్నారు.
అలా విశాఖ రైల్వే స్టేషన్ లో అమ్మే ఆహార పదార్ధాలలో పరిశుభ్రత, నాణ్యత రెండూ ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ధారించింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటుచేసిన ఉన్నత ప్రమాణాల మేరకు విశాఖ రైల్వే స్టేషన్ నెగ్గింది, అలా ఈట్ రైట్ ని సాధించింది.
దేశంలో ఈ రకంగా ఈట్ రైట్ ని కలిగి ఉన్న రైల్వే స్టేషన్లు ఆరు మాత్రమే ఉన్నాయి. అందుకో పొరుగున ఒడిషాలోని భువనేశ్వర్ స్టేషన్ తో పాటు చండీగఢ్, ఢిల్లీలోని ఆనంద విహార్, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్, ముంబై-సెంట్రల్ రైల్వే స్టేషన్, వడోదరా ఉన్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే ఈట్ రైట్ హోదా కలిగిన ఏకైన రైల్వే స్టేషన్ మాత్రం ఒక్క విశాఖ మాత్రమే సుమా.
ఇదే రకమైన స్పూర్తితో పరిశుభ్రతా నాణ్యతా ప్రమాణాలు పాటించే విధంగా మిగిలిన రైల్వే స్టేషన్లను కూడా తీర్చిదిద్దుతామని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా విశాఖకు రెగ్యులర్ గా వచ్చే టూరిస్టులకు ఇది గుడ్ న్యూస్. మంచి ఫూడ్ ఇలా నాణ్యతతో దొరకడం అంటే వారు ఫుల్ హ్యాపీయే కదా.