వీకెండ్ లీడర్ పవన్‌కల్యాణ్ మళ్లీ కనిపించడం లేదు. వారానికి ఒకసారి ఏదో ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుని రాజకీయంగా ఉనికి చాటుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి కార్యక్రమం కూడా లేనట్టుంది. దీంతో ఆయన పేరు వార్తల్లో కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పక్షాలైన టీడీపీ, వైసీపీ నియోజకవర్గాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాయి.
దీంతో ఏఏ నియోజకవర్గాల్లో తమ పార్టీ బలంగా, బలహీనంగా ఉన్నాయో వైసీపీ, టీడీపీ సర్వేలు నిర్వహిస్తూ అందుకు తగ్గట్టు చర్యలు తీసుకునే పనిలో ఉన్నాయి. అదేంటో గానీ, ఎన్నికలు దగ్గరపడే కొద్ది పవన్‌కల్యాణ్ మాత్రం జనానికి దూరం కావడం చర్చకు దారి తీసింది. భవిష్యత్ రాజకీయంపై ఆయన ఆయోమయంలో ఉన్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
పార్టీ పెట్టి 9 ఏళ్లకు పైన అవుతున్నా, ఇంత వరకూ క్షేత్రస్థాయిలో నిర్మాణం జరగలేదు. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేస్తే మరోసారి చేదు ఫలితాలు తప్పవని ఆయనకు బాగా తెలుసు. దీంతో టీడీపీతో పొత్తు కోసం పరితపిస్తున్నారు. ఇప్పటికే ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు. టీడీపీతో పొత్తును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీని కాదని ఆయన టీడీపీతో కలిసి వెళ్లే పరిస్థితి లేదు. తన పార్టీ భవిష్యత్ పొత్తుపై ఆధారపడి ఉందని ఆయన నమ్ముతున్నారు. ఇది నిజం కూడా.
అలాగని గతంలో మాదిరిగా జనసేనతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడడం లేదు. జనసేనతో పొత్తు లేకుండానే అధికారంలోకి వస్తామనే ధీమా టీడీపీలో కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతే తమకు అధికారం తెచ్చి పెడుతుందనే నమ్మకం టీడీపీలో కనిపిస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకుని, అనవసరంగా కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వస్తుందని, ఇది పార్టీకి నష్టం తెస్తుందనే భయం టీడీపీలో లేకపోలేదు.
ఏపీలో ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో పవన్‌కల్యాణ్ భవిష్యత్ త్రిశంకుస్వర్గంలో ఉన్నట్టైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పవన్ రాజకీయ పంథా లేదన్నది వాస్తవం. ఇదే ధోరణి కొనసాగితే మాత్రం ఎన్నికలకు ముందే ఆయన పార్టీ ఉనికి కోల్పోవడం ఖాయమనే చర్చ నడుస్తోంది.