తిరుపతి రుయాలో అమానవీయ ఘటన ఏపీ సర్కార్‌కు నష్టం కలిగించింది. ఇటీవల వరుస దుర్ఘటనలతో ఏపీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎవరో చేసిన తప్పులకు ప్రభుత్వం బద్నాం కావాల్సి వస్తోంది. తిరుపతి రుయాలో ప్రభుత్వాన్ని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. పది అంబులెన్స్ వాహనాలున్న ఓ వ్యక్తి… ఈ మొత్తం అమానవీయ ఘటనను వెలుగులోకి తెచ్చాడంటేనే, దాని వెనకున్న కుట్రను పసిగట్టొచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా …. ఇప్పుడు అసలు విషయం బయట పడిన తర్వాత వైసీపీ లబోదిబోమంటే ఏం ప్రయోజనం?
ఈ మొత్తం వ్యవహారంలో పది అంబులెన్స్‌లున్న టీడీపీ నాయకుడికి, రుయాలో ఇతర అంబులెన్స్ యజమానులకు మధ్య వ్యాపార ఆధిపత్యమే వివాదానికి దారి తీసిందని సమాచారం. ఈ కుట్రలో తొమ్మిదేళ్ల జాషువా మృతదేహం, అతని తండ్రి నరసింహులు పావులయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అంబులెన్స్ దందా ఈనాటిది కాదు. పాలకులు మారినప్పుడల్లా దందారాయుళ్లు కూడా మారుతుంటారు. అంతే తప్ప, దౌర్జన్యాలు, దాదాగిరి మాత్రం మారడం లేదు. తిరుపతి రుయా వద్ద కూడా ఇదే జరిగింది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల మినహా మిగిలిన జిల్లాలు, అలాగే నెల్లూరు జిల్లాకు వైద్యానికి సంబంధించి తిరుపతి రుయా, స్విమ్స్ దిక్కు. రుయాలో ఉచిత వైద్యం కావడంతో పాటు మంచి వైద్యులు ఉండడంతో ఎక్కువ మంది రోగులు వస్తుంటారు.
ఈ నేపథ్యంలో మృతదేహాలు లేదా రోగులు మరెక్కడికైనా వెళ్లాలన్నా తమ అంబులెన్స్‌లనే తీసుకెళ్లాలని అక్కడి వారు డిమాండ్ చేస్తుంటారు. కాదు, కూడదని ఎవరైనా అంటే దాడులకు కూడా వెనుకాడరు. నిజానికి రుయాలో నాలుగు మహాప్రస్థానం వాహనాలున్నాయి. అయితే వీటిపై రోగులకు అవగాహన లేదు. రుయా నుంచి చుట్టుపక్కల 200 కిలోమీటర్ల పరిధి వరకు ఉచితంగా మృతదేహాలను తీసుకెళ్లే సౌకర్యం ఉంది. జాషువా మృతదేహాన్ని సమీపంలోని 90 కిలోమీటర్ల దూరంలోని స్వస్థలానికి తరలించడం పెద్ద కష్టమేమీ కాదు.
అయితే జాషువా తండ్రి నరసింహులకు మహాప్రస్థానం వాహనం ద్వారా తీసుకెళ్లొచ్చనే అవగాహన లేదు. ఇదే సందర్భంలో మృతుల సమాచారాన్ని వెంటనే అంబులెన్స్ డ్రైవర్లకు తెలిపే నెట్‌వర్క్ రుయాలో వేగంగా పని చేస్తుంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. భారీ మొత్తంలో అంబులెన్స్ డ్రైవర్లు డిమాండ్ చేయడం, అంత స్తోమత తన వద్ద లేదని చెప్పడం, అనంతరం ప్రైవేట్ అంబులెన్స్ రావడం వివాదానికి దారి తీశాయి.
జాషువా మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నందకిషోర్ అనే అంబులెన్స్ యజమాని వాహనాన్ని రుయాకు పంపాడు. ఈ నందకిషోర్‌కు, రుయాలోని అంబులెన్స్ యజమానులకు వ్యాపార వివాదం ఉన్నట్టు సమాచారం. దీంతో అక్కడికొచ్చిన నందకిషోర్ వాహనాన్ని అడ్డుకున్నారు. బాలుడి శవాన్ని అంబులెన్స్‌లో ఎక్కించకుండా అడ్డుకున్నారు. ఇదే అవకాశంగా తీసుకున్న నందకిషోర్, దీన్ని వివాదం చేయాలని నిర్ణయించుకున్నాడు.
కరకంబాడీ వద్ద అంబులెన్స్ పెట్టి, రుయా నుంచి భుజంపై శవాన్ని తీసుకెళ్లేలా నరసింహులను ఒప్పించాడు. ఈ పని చేస్తే తనకు బాడుగ కూడా వద్దని బాధితుడు నరసింహులుతో నందకిషోర్ చెప్పినట్టు సమాచారం. అంతా పక్కా పథక రచనతో రుయాలో నందకిషోర్ దిగాడు. తన ద్విచక్ర వాహనం, దాన్ని నడిపే డ్రైవర్ అంతా తనవారినే ఏర్పాటు చేశాడు. నరసింహులు తన కుమారుడి మృతదేహాన్ని భుజంపై వేసుకోవడం, అనంతరం ద్విచక్ర వాహనంలో కూచోవడాన్ని చక్కగా తన మనిషితో సెల్‌ఫోన్‌లో రికార్డు చేయించాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేయించాడు.
రుయా వద్ద ప్రతిపక్షాల ఆందోళనలు, చంద్రబాబునాయుడు ఘాటు ట్వీట్ అన్నీ చకచకా జరిగిపోయాయి. రాజకీయ కుట్రలో వైసీపీ ఘోరంగా దెబ్బతింది. పది అంబులెన్స్‌లున్న నందకిషోర్ ….రుయాలో దందాను అరికట్టడానికి ముందుకొచ్చాడనే జోక్ ఆలస్యంగా తెలుసుకున్న వైసీపీ నిస్సహాయ స్థితిలో ఉండిపోవడం గమనార్హం. కారణం ఏదైనా …కనీసం ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అంబులెన్స్ దందా ఆగిపోతే అంతకంటే జనానికి కావాల్సింది ఏముంటుంది? రాజకీయ లాభనష్టాలను పార్టీలు చూసుకుంటాయి. ప్రజలకు ఉపయోగ పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను తిరుపతి రుయా ఎపిసోడ్ గుర్తు చేస్తోంది.