మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఇంతవరకు కొడాలి నాని గుడివాడకు రాలేదట. ఆ మాటకొస్తే అసలాయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదట. హైదరాబాద్ లోనే ఉన్నారని అంటున్నారు. ఈనెల 7న మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కొడాలి నాని నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఆ తర్వాత కొత్త మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చినా మళ్లీ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. అంతేకాని గుడివాడకు మాత్రం ఆయన రాలేదు. మంత్రి పదవిలో ఉన్నా కూడా ఇన్నిరోజులు ఆయన గుడివాడకు రాకుండా ఎప్పుడూ ఉండలేదని, ఇంత గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదని అంటున్నారు. మరి నాని, గుడివాడ మధ్య దూరం ఎందుకు పెరిగింది.
నానితో పాటు రాజీనామా చేసి బి-టీమ్ లో అవకాశం లేని చాలామంది మాజీ మంత్రులు అడపాదడపా మీడియా ముందుకొచ్చారు. బెట్టువీడిన బాలినేని సీఎం సభలో పాల్గొన్నారు. మళ్లీ గెలుస్తాం, తిరిగి మంత్రి వర్గంలోకి వస్తామంటూ ఇటీవల పదే పదే మీడియా ముందు చెప్పారు అనిల్ కుమార్ యాదవ్.
పేర్ని నాని కూడా పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు, మీడియాతో ముచ్చటించారు. పుష్పశ్రీ వాణి తోట పనిచేస్తూ ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచారు. కానీ నాని మాత్రం మీడియా ముందుకు రాలేదు, అటు గుడివాడలోనూ అడుగు పెట్టలేదు.
మంత్రి పదవి పోయిన తర్వాత కొడాలి నాని అసంతృప్తితో ఉన్నారని కొంతమంది అంటున్నారు. అయితే ఆయన మిగతా వారిలాగా బయటపడలేదు. కనీసం ఎక్కడా కామెంట్ కూడా చేయలేదు. రాజీనామాలకు ముందు మాత్రం.. పదవి ఉంది కాబట్టి చంద్రబాబు, చినబాబు బతికిపోయారని ఓ సందర్భంలో హెచ్చరించారు, పదవి లేకుండా ఉంటే తన మాటల్ని తట్టుకోలేరన్నారు.
ఇప్పుడు నానికి పదవి లేదు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు తగ్గించలేదు. ఒంగోలు కారు ఘటన, విజయవాడ అత్యాచార ఘటనను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మరి కొడాలి నాని ఎందుకు స్పందించలేదు. ఆయన మార్కు వార్నింగ్ లు ఎందుకు ఇవ్వలేదు..? అసలు నాని ఇప్పుడేం చేస్తున్నారు. గుడివాడకు ఎందుకు దూరమయ్యారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.