టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాన్ మాటలు కోటలు దాటుతున్నాయి. ఇక అధికారంలోకి వచ్చినట్టే అని వారు నమ్మబలుకుతున్నారు. భోగి పండుగ సందర్భంగా చంద్రబాబు ఏకంగా జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని చెప్పారు.
ఇక ఎన్నికలకు 87 రోజులే ముగిలి వుందని ఆయన అన్నారు. ప్రతి సమస్యకు.. ఇక మూడు నెలలు ఆగండి, మన ప్రభుత్వం వస్తుందని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ హామీలిస్తున్నారు.
ఇంత వరకూ బాగానే వుంది. అసలు అభ్యర్థుల ప్రకటన ఎప్పుడనే ప్రశ్న టీడీపీ, జనసేన నేతల నుంచి వస్తోంది. అప్పుడప్పుడు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీ కావడమే తప్ప, ఏం మాట్లాడుకుంటున్నారో ఇంత వరకూ బయటికి చెప్పలేదు. రాజకీయాల్లో అన్నీ బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ చర్చల ఫలితాలు చేతల్లో కనిపించాలి కదా? అదీ లేదు. మరి ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకుంటున్నట్టు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కనీసం తమకు 50 సీట్లు తక్కువ ఇస్తే, కాపుల ఓట్లు టీడీపీకి వేసే ప్రశ్నే లేదని జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారు. అందులో సగం వస్తే గొప్పని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సీట్ల సంఖ్య, నియోజకవర్గాల కేటాయింపు రెండు పార్టీలకు సమస్యే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే చంద్రబాబు జాప్యం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా నామినేషన్ ప్రక్రియ వరకూ నాన్చివేస్తూ వస్తారనే భయం జనసేన నేతల్లో కనిపిస్తోంది.
చంద్రబాబు నైజం ఇదే అని, అన్నీ తెలిసి ఆయనతో పొత్తు పెట్టుకున్నాక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో అనే ఆందోళన జనసేన నేతల్లో కనిపిస్తోంది. జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని చెబుతూనే, మరోవైపు అభ్యర్థుల ప్రకటన స్టార్ట్ చేయకపోతే సీఎంను ఎదుర్కోవడం సాధ్యమా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. మరోవైపు వైసీపీ అభ్యర్థుల ప్రకటన చకచకా జరిగిపోతోందని వారు గుర్తు చేస్తున్నారు.
జగన్‌పై విమర్శలు కేవలం మీడియాకే పరిమితం అవుతున్నాయని, వైసీపీని ఓడించడానికి జనసేన-టీడీపీ కూటమి వ్యూహం మాత్రం బాగా లేదనే చర్చకు తెరలేచింది.