జనసేనాని పదేపదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెబుతుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా జగన్నామ స్మరణే చేశారాయన. దీన్ని బట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఎంత అక్కసుతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తాజా ప్రసంగంలో పవన్ ఏమన్నారంటే…
“వైసీపీ అద్భుతమైన పాలన అందించి వుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాట అనేవాన్ని కాదు. అలా లేకుండా ప్రజలంతా ఇబ్బంది పడుతుండడం వల్లే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి జనసేన వైపు చూడండి” అని పవన్ అన్నారు.
జనసేన వైపు చూడండి అంటూనే, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటే ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తామనేది ఆయన మాటల సారాంశం. కానీ టీడీపీతో కలవడానికి బీజేపీ ఆసక్తిగా లేదు. మరోవైపు టీడీపీ, బీజేపీని కలిపేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో తమకు ప్రజాదరణ పెరుగుతోందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండానే అధికారంలోకి వస్తామనే ధీమా టీడీపీలో పెరిగింది.
దీంతో పవన్‌కల్యాణ్‌కు కూడా దూరంగా ఉండాలని ఆ పార్టీ ఆలోచన. కానీ పవన్ మాత్రం ప్రజల్ని కాకుండా పొత్తుల్ని మాత్రమే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ అనడం సరే…. ఇంతకూ ఆయన ఓటు బ్యాంక్ ఏది? అనే ప్రశ్న వస్తోంది. ఏపీలో పవన్ సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు 18 శాతం ఓట్లు రావడానికి ప్రధానంగా ఆయన సామాజిక వర్గం అండగా నిలబడడమే కారణం.
ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి తన సామాజిక వర్గం అండగా వుంటుందని పవన్ నమ్ముతున్నారు. సామాజిక వర్గ మద్దతు, అలాగే సినీ అభిమానులు లేకపోతే పవన్‌కు ఎక్కడి నుంచి ఓట్లు వస్తాయ్? పోనీ వాళ్ల మద్దతు వుంటే గత ఎన్నికల్లో ఆయనతో పాటు పార్టీ ఘోరంగా ఎందుకు ఓడింది? అసలు ఆయన ఏం చేశారని జనం అండగా ఉంటారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తాను మద్దతు ఇచ్చే పార్టీలకు సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా పడతాయని పవన్ విశ్వసిస్తున్నారు. అందుకే ఆయన పదేపదే తన సామాజిక వర్గం సమస్యల్ని ప్రస్తావిస్తూ వుంటారు.
సినిమా షూటింగ్‌లు లేని సమయంలో, వీకెండ్స్‌లో మాత్రమే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే పవన్‌కల్యాణ్‌ను ప్రజలు ఏమని నమ్మి పట్టం కట్టాలి? ఈ దఫా ఎన్నికల్లో ఒక్కసారి జనసేన వైపు చూడాలని కోరుతున్న పవన్….తన మిత్రపక్షమైన బీజేపీ సంగతేంటి? రాజకీయంగా తనకే ఇంత వరకూ ఒక స్పష్టత లేని పవన్‌కల్యాణ్ చెప్పే మాటలకు విలువ వుంటుందని ఎవరూ భావించడం లేదు. భ్రమల్లో వుంటూ అప్పుడప్పుడు రెండు మాటలు మాట్లాడుతూ , మళ్లీ ఎప్పుడు కనిపిస్తారో తెలియని జనసేనాని ప్రత్యర్థుల గురించి విమర్శించడం విడ్డూరమే.