ఎన్టీఆర్ తనయ నారా భువనేశ్వరిని ఇంకా ఎంత కాలం బద్నాం చేస్తారు? ఎన్టీఆర్ తనయ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. తన పని తప్ప, మరేవీ పట్టించుకోని మనస్తత్వం ఆమెది. రాజకీయాల వాసన కూడా ఆమెకు పట్టదు. అలాంటి మహిళను అకారణంగా, అభ్యంతరకర పరిస్థితుల్లో రాజకీయాల్లోకి లాగారు.
తన భార్యను దూషించారని, ఇందుకు నిరసనగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు, తిరిగి ముఖ్యమంత్రి హోదాలో మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. భార్యపై అసభ్య కామెంట్స్‌కు నొచ్చుకున్న చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చారు. మహిళలపై సున్నిత అంశాలకు సంబంధించి వ్యవహారాలు చర్చకు రావాలని ఎవరూ కోరుకోరు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీ మహిళలు అవాంఛనీయ విషయాలు చర్చకు రాకపోవడమే మంచిదని అనుకుంటారు.
అదేంటోగానీ చంద్రబాబు వైఖరి అందుకు భిన్నంగా వుంది. చివరికి తన రాజకీయ ప్రయోజనాల కోసం భార్య భువనేశ్వరిని బద్నాం చేయడానికి కూడా వెనుకాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భువనేశ్వరిపై తన ప్రత్యర్థులు అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని విమర్శించే ముసుగులో సానుభూతి పొందే స్వార్థం కనిపిస్తోంది. ఇంతకంటే రాజకీయాల్లో దిగజారుడుతనం ఉండదేమో అనే చర్చ జరుగుతోంది.
కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ భువనేశ్వరిపై అభ్యంతరకర కామెంట్స్ ప్రస్తావన తీసుకురావడం ఆయన స్వార్థపూరిత నైజానికి నిదర్శనమే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.
“నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరూ నన్ను అవమానించే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో నన్ను, నా సతీమణిని అవమానించారు. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నా. అది గౌరవ సభ కాదు కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని ఆ రోజే చెప్పా. నేను అసెంబ్లీకి పోవాలంటే, రాష్ట్రానికి న్యాయం జరగాలంటే రేపు జరిగే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా”
భువనేశ్వరిని కుట్రపూరితంగా రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. మళ్లీ తన పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని కోరేందుకు భువనేశ్వరి ఎపిసోడ్‌ను ముందుకు తెచ్చారని అర్థం చేసుకోవచ్చు. ఒక్క చంద్రబాబు తప్ప, మరెవరూ ఇలా భార్యను రాజకీయాల్లోకి లాగరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీని తూర్పార పట్టడానికి భువనేశ్వరి ఎపిసోడ్ తప్ప, మరేది చంద్రబాబుకు దొరకలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అధికారం కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా దిగజారుతారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటే ఏమో అనుకున్నాం గానీ, భువనేశ్వరని కూడా బద్నాం చేసేంతగా అని ఇప్పుడే అర్థమైందనే వాళ్లు లేకపోలేదు.