ఈ దఫా అధికారం దక్కకపోతే టీడీపీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే ఈ ఎన్నికలకు చంద్రబాబునాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డారు. చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదల్లేదు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సీట్ల పంపకాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు.
ఎన్నికల్లోనూ, అనంతరం కూడా బాబు కోరుకున్నట్టు ఎన్నికల కమిషన్‌తో పాటు ఇతర వ్యవస్థల సహకారాన్ని పొందగలిగారు. ఇక కౌంటింగ్ ప్రక్రియ ఒక్కటే మిగిలి వుంది. ఇంత వరకూ వ్యవస్థల పరంగా సానుకూల వాతావరణం ఉండడంతో చంద్రబాబులో అధికారంపై ధీమా కనిపిస్తోంది. అయితే ప్రజలు ఏం చేసి వుంటారో అనే భయం ఒక్కటే ఆయన్ను వెంటాడుతోంది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని మొదటి నుంచి ఆయనకు గొప్ప పేరు వుంది.
కానీ ప్రజల విషయానికి వచ్చే సరికి ఆయన్ను నమ్మరనే చర్చ లేకపోలేదు. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే… మేనిఫెస్టో అమలుపై దృష్టి పెడుతుందని ఎవరైనా అనుకుంటే , అంతకంటే అజ్ఞానం మరొకటి వుండదు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే… టీడీపీ నేతల ప్రధాన లక్ష్యం ఏంటంటే, ప్రత్యర్థులపై వేట మొదలు పెట్టడమే.
ఈ ఏకైక లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే అధికారం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారనేది నిజం. నారా లోకేశ్ ఏకంగా రెడ్ బుక్‌ను చేతిలో పెట్టుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా గ్రామీణ స్థాయి నుంచి చంద్రబాబు వరకూ టీడీపీ నేతలంతా పగ, ప్రతీకారాలతో రగిలి పోతున్నారు. అధికారం రావడమే ఆలస్యం.. వైసీపీ నేతలపై భౌతిక, ఇతరత్రా దాడులకు దిగేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో గొడవలు జరుగుతాయని నిఘా వర్గాలు హెచ్చరించడాన్ని చూడాలి. ఓట్ల లెక్కింపు తర్వాత ఏపీలో హింస ప్రజ్వరిల్లకుండా పటిష్ట భద్రత కోసం కేంద్ర బలగాలను రప్పిస్తున్నారు. ఈ బలగాలు మూడు వారాల పాటు ఏపీలో వుంటాయి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి?
టీడీపీ ఆలోచనలన్నీ ప్రత్యర్థులను ఎలా టార్గెట్ చేయాలనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. దాని కోసమే అధికారం కావాలని టీడీపీ కోరుకుంటోంది. అందుకే జూన్ 4న వెలువడే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.