మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్తారా? వెళ్లరా? అనే చర్చ వైసీపీలో అంతర్గతంగా జరుగుతోంది. పలు కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి వుంటున్నారు. సోమవారం ఆయన్ను మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి కలుసుకున్నారు. పిన్నెల్లికి ధైర్యం చెప్పి వచ్చారు.
పిన్నెల్లి కుటుంబాన్ని చంద్రబాబు సర్కార్ టార్గెట్ చేసింది. రానున్న రోజుల్లో పిన్నెల్లి కుటుంబాన్ని మరిన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం వుంది. మాచర్లలో పిన్నెల్లి కుటుంబం రాజకీయంగా బలంగా వుంది. పిన్నెల్లి కుటుంబం అడ్డు తొలగించుకుంటే టీడీపీకి ఎదురు లేదని ఆ పార్టీ పెద్దల భావన. ఈ నేపథ్యంలో పిన్నెల్లి కుటుంబాన్ని భయపెడితే మరెవరూ రాజకీయంగా ముందుకు రారనేది టీడీపీ వ్యూహం.
ఈ నేపథ్యంలో నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లిని జగన్ ఎప్పుడు పరామర్శిస్తారో అనే చర్చకు తెరలేచింది. బెంగళూరు పర్యటన ముగించుకుని మంగళవారం తాడేపల్లికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకుంటారు. ఈవీఎం ధ్వంసంతో పాటు ఇతరత్రా కేసుల్లో జైలుపాలైన పిన్నెల్లి గురించి జగన్ ఆలోచిస్తున్నారా? లేదా? అనేది ప్రశ్నగా మిగిలింది. బాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పిన్నెల్లిది మొదటి అరెస్ట్.
చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పుడే నోరెత్తని జగన్ ప్రకటించారు. ఆరు లేదా ఏడాది సమయం చంద్రబాబు సర్కార్‌కు ఇస్తామని తన పార్టీ నాయకులతో జగన్ అన్నారు. ఈ సమయంలో కూటమి నేతల దాడులు, అలాగే కేసుల్లో ఇరుక్కున్న నేతలు, కార్యకర్తల్ని పరామర్శించడానికి జగన్ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పిన్నెల్లిని పరామర్శిస్తే, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో లీడర్‌పై నమ్మకం ఏర్పడుతుందని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో!