తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో కలిసి వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు జైల్లో చంద్రబాబు ఏం చేస్తున్నాడనే అంశం గురించి వివరించారు!
వారం రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడ 2047 గురించి ఆలోచిస్తున్నారట! ఈ 2047 గురించి ఆలోచించడం ఏమిటంటే.. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు విజన్ 2047 గురించి ప్రకటించారుగా! విజన్ అంటే కలలు గనడం అని, ఇంటర్ లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ తీసుకోవాలని.. ఇలా ఏదేదో తనే అందరికీ తెలిసేలా చేసినట్టుగా చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రసంగించారు!
మరి ఇప్పుడు ఆ విజన్ 2047 గురించినే చంద్రాబు నాయుడు ఆలోచిస్తున్నారట! అలాగే రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారట, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గురించి ఆలోచిస్తున్నారట! 'మనవాళ్లంతా ఎలా ఉన్నారు..' అని యనమలతో చంద్రబాబు నాయుడు ఆరా తీశారట! తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తూ ఇబ్బంది పెడుతోందంటూ చంద్రబాబు బాధపడ్డారట!
అవతల లోకేషేమో .. ఎక్కువ కేసులు పెట్టించుకున్న కార్యకర్తలకు పెద్ద పెద్ద పదవులు అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తే, చంద్రబాబు ఇలా బాధపడటం ఏమిటో మరి! తనపై తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరిపైనా కేసులు పెట్టారంటూ యనమల అన్నారు! మరి ఈ మాట గనుక లోకేష్ కు వినిపిస్తే.. ఎలా స్పందిస్తారో మరి! చంద్రబాబుతో ములాఖత్ తర్వాత యనమల ప్రసంగం ఇలా సాగింది.
చంద్రబాబునే జైల్లో పెట్టారు కానీ, నా పై కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టాలేకపోయారు చూశారా! అన్నట్టుగా యనమల మాటల్లో ఆనందం వ్యక్తం అయ్యింది.