ఇది ఎన్నికల సీజన్. ఇటూఇటూ జంపింగ్‌లు సాగుతున్నాయి. కొంత మందిపై పార్టీ ఫిరాయింపులు వార్తలొస్తున్నాయి. దీంతో ఆ నాయకులు ఉలిక్కి పడుతున్నారు. అబ్బే, తామెరితోనే చర్చలు జరపలేదని, చివరి శ్వాస వరకూ పార్టీలోనే కొనసాగుతామనే డైలాగ్స్ తరచూ వింటున్నాం. రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరని అంటుంటారు. అవునంటే కాదని, కాదంటే అవునని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
ఏ నాయకులైతే విపరీతంగా తమ నిబద్ధత, విధేయత గురించి మాట్లాడుతారో, వాళ్లనే అనుమానించాల్సి వుంటుంది. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ, జగన్‌పై విధేయతను చాటే క్రమంలో విపరీత వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను చనిపోతే, మృతదేహంపై వైసీపీ జెండా కప్పాలని తీవ్ర భావోద్వేగంతో ఆయన మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్‌చార్జ్.
తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్‌రావు పార్టీ మార్పుపై తీవ్రంగా స్పందించారు. తన ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే వుంటానని చెప్పుకొచ్చారు. అసలు తాను పుట్టిందే టీడీపీ కోసమని, చనిపోయేది కూడా ఆ పార్టీ కోసమే అంటూ తీవ్ర భావోద్వేగంతో కూడిన కామెంట్స్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్లనే అసలు నమ్మకూడదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.
రానున్న ఎన్నికల్లో ఏ మాత్రం అటూఇటూ అయినా పార్టీ మారడానికి ఏ మాత్రం వెనుకాడరని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి లాంటి నేత తాజా ఉదాహరణ అయితే, రేపు యరపతినేని ఆ జాబితాలో చేరొచ్చనే టాక్ వినిపిస్తోంది. అధినాయకుల ప్రాపకం కోసమే… ప్రాణం ఉన్నంత వరకూ లాంటి సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతుంటారనే విమర్శ వ్యక్తమవుతోంది.