ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కించుకున్న ప్రతి ఒక్కరూ తాము అదృష్టవంతులమని భావిస్తుంటారు. గెలుపోటముల సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు ప్రధాన పార్టీల టికెట్లు దక్కించుకోవడమే పెద్ద విజయం. తాజాగా టీడీపీ జాబితాలోని 94 మంది అభ్యర్థుల్లో ఇద్దరు మహిళా నేతలు టికెట్లు దక్కించుకోవడం సొంత పార్టీ నేతల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఇద్దరు మహిళా నేతలు భూమా అఖిలప్రియ, వంగలపూడి అనిత.
టీడీపీ టికెట్లు దక్కించుకున్న అదృష్టవంతులు అఖిలప్రియ, వంగలపూడి అనిత. ఇదే సందర్భంలో వీరికి టికెట్లు ఇచ్చి దురదృష్టవంతుడిగా చంద్రబాబు సొంత పార్టీ నేతల సానుభూతి పొందుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియకు, విశాఖ జిల్లా పాయకరావుపేట టికెట్ అనితకు చంద్రబాబు కేటాయించారు. చాలా కాలంగా వీళ్ల వ్యవహార శైలిపై సొంత పార్టీ శ్రేణుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
ఇటు అఖిలప్రియ, అటు అనితకు టికెట్లు ఇస్తే ఓడించి తీరుతామని భూమా కుటుంబ సభ్యులు, అలాగే టీడీపీ, జనసేన నాయకులు బహిరంగంగానే హెచ్చరించడం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ అడ్డంకులన్నీ అధిగమించి ఇద్దరు మహిళా నాయకురాళ్లు టికెట్లు సాధించుకోగలిగారు. ఇందుకు వీరిని అభినందించాలి.
ఇదే సందర్భంలో ఆళ్లగడ్డ, పాయకరావుపేటలలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు … ఆ నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా వుంటాయో. ఇటీవల జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు పాయకరావుపేట టీడీపీ ఇన్చార్జ్ వంగలపూడి అనితపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనితకు టికెట్ ఇస్తే తామే ఓడిస్తామని జనసేన నాయకులు ఏకంగా నాగబాబుకే తేల్చి చెప్పారు. ఏది ఏమైనా వైసీపీకి కలిసొచ్చే కాలానికి అఖిలప్రియ, అనితకు టికెట్లు దక్కాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆల్ ది బెస్ట్ అఖిల, అనిత. బ్యాడ్ లక్ బాబు. ఈ రకంగా సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివిస్టులు సెటైర్స్ విసురుతున్నారు.