లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు ఉండడం రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలు దీన్ని అవకాశంగా తీసుకుని అధికార పార్టీలను ఆత్మరక్షణలో పడేసేందుకు వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడారు.
అమిత్ ఆరోరా చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని తన పేరును రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు తనకు అమిత్ అరోరా ఎవరూ తెలియదని స్పష్టం చేశారు. అమిత్‌ది నార్త్ ఇండియా అని ఆయన చెప్పుకొచ్చారు. నార్త్ ఇండియన్‌తో వ్యాపారాలు ఎందుకు చేస్తామని ఆయన ప్రశ్నించారు.
అలాగే తమకు ఎలాంటి లిక్కర్ వ్యాపారం లేదని స్పష్టం చేశారు. గతంలో లిక్కర్ వ్యాపారాలు చేసేవాళ్లమన్నారు. ఇప్పుడు వాటితో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలు తాను ఇచ్చాననడంలో వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పారు. లిక్కర్ వ్యాపారంలో కుంభకోణంలోకి వైసీపీ పెద్దల్ని లాగాలని టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాగుంట, ఆయన తనయుడు రాఘవరెడ్డి పేర్లు తెరపైకి రావడం వైసీపీకి ఇబ్బందికర పరిస్థితే. ఈడీ రిపోర్ట్‌లో తమ పేర్లు ఉండడాన్ని వారు ఖండిస్తున్నారు. మాగుంట కుటుంబ సభ్యులతో పాటు విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్ పేరు ఉండడం టీడీపీకి ఆయుధం ఇచ్చినట్టైంది. దీంతో వైసీపీ ముఖ్య నేతలకు లిక్కర్ కుంభకోణంలో పాత్ర వుందని విమర్శించేందుకు ఆస్కారం ఇచ్చినట్టైంది. ముఖ్యంగా కేసీఆర్, మోదీ మధ్య సాగుతున్న పోరులో లిక్కర్ కుంభకోణం ఏ మలుపు తీసుకోనుందో చూడాలి.