తిరుమల దళార్ల కోసం విలపిస్తున్న పచ్చమీడియా!

తిరుమలలో గదుల ధరల పెంపు మీద అనవసరమైన రాజకీయం నడుస్తోంది. ‘ధరల పెంపు’ అనే ఒక్క మాట కనిపించింది కదా అని.. అడ్డగోలుగా విమర్శలు చేయడానికి, బురద చల్లడానికి పచ్చమీడియా తెగబడింది. ముందువెనుక చూసుకోలేదు.…

తిరుమలలో గదుల ధరల పెంపు మీద అనవసరమైన రాజకీయం నడుస్తోంది. ‘ధరల పెంపు’ అనే ఒక్క మాట కనిపించింది కదా అని.. అడ్డగోలుగా విమర్శలు చేయడానికి, బురద చల్లడానికి పచ్చమీడియా తెగబడింది. ముందువెనుక చూసుకోలేదు. ధరల పెంపు సహేతుకమా కాదా అనేది తర్కించుకోలేదు. ధరల పెంపు వలన సామాన్యులకు నష్టం జరుగుతుందా? లేదా, సంపన్నులకు మాత్రమే వర్తిస్తుందా? కూడా చెక్ చేసుకోలేదు. అడ్డగోలుగా కథనాలు రాశారు. చూడబోతే.. గదుల కేటాయింపులో ధరలు పెంచడం వలన నష్టపోయే దళారీల కోసమే ఈ పచ్చమీడియా ఇంతగా విలపిస్తున్నట్టు కనిపిస్తోంది. 

ఈ కథనం చదివితే అసలు తిరుమలలో కాటేజీల ధరలు పెంచడం అనే నిర్ణయం కరెక్టో కాదో.. పాఠకులకే అర్థమవుతుంది. 

తిరుమలలో మొత్తం భక్తులకోసం కేటాయించడానికి 7500 గదులు ఉన్నాయి. వీటికి నాలుగు యాత్రికుల వసతిసముదాయాలు అదనం. ఇందులో మొత్తం 5000 గదులను రూ.50, రూ.100 వంతున భక్తులకు కేటాయిస్తుంటారు. వీటిధరల్లో కించిత్తు కూడా మార్పు లేదు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల్లో కూడా కొత్తగా కోట్లరూపాయలు వెచ్చించి గీజర్లు వంటి సదుపాయాలను ఏర్పాటుచేశారు. అయినా సరే వీటి ధర పెంచలేదు. అదే సమయంలో సిఫారసు ఉత్తరాలు తెచ్చుకుని గదులు పొందే వీఐపీలకు కేటాయించే కొన్ని కాటేజీలకు కూడా 150, 750 వంతున అతి తక్కువ ధరలున్నాయి. వీటిలో ఏసీ కాటేజీలు కూడా ఉన్నాయి. 

ఇదేమాదిరి సదుపాయాలతో ఉండే గెస్ట్ హౌసులు కొన్నింటికి 2000 రూపాయలకు అటుఇటుగా అద్దెలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీఐపీలకు కేటాయించే కాటేజీల ధరలను ఏకరీతిగా ఉండేలా క్రమబద్ధీకరిస్తూ కొన్ని రకాల కాటేజీలకు మాత్రం ధరలు పెంచారు. ఈ ధరల పెంపు అనేది కేవలం 170 కాటేజీలకు మాత్రమే వర్తిస్తుంది. అంతే తప్ప.. సామాన్య భక్తులకు కేటాయించే వేల కాటేజీలకు ధర పెంచినట్లుగా సాగుతున్న దుష్ప్రచారం అవాస్తవం. ఏసీ సహా వీఐపీ సదుపాయాలు ఉన్న అన్ని రకాల కాటేజీలకు ఒకే తరహా ధర ఉండడం కోసం చేసిన సవరింపు తప్ప.. భక్తుల మీద భారం పెంచడం కోసం చేసిన నిర్ణయం కాదు. 

అయితే ధర పెంపు అనే పదం టీటీడీ నుంచి బయటకు రాగానే.. పచ్చ మీడియా రెచ్చిపోయి కారుకూతలు కూస్తోంది. నీచమైన రాతలు రాస్తోంది. భక్తులకు ద్రోహం జరిగిపోతున్నట్టుగా ప్రచారం చేస్తోంది. ఈ రాతలన్నీ కూడా తిరుమలను అప్రతిష్ట పాల్జేయడానికి చేసే కుయత్నాలే అని గుర్తించాలి.