చవకబారు వ్యాఖ్యలే పచ్చమీడియా ప్రాణాధారాలా?

మీడియా అంటే.. మన సమాజంలో ఒక గౌరవం ఉంది. ఇదివరకటి రోజుల్లో అయితే మీడియా అంటే కేవలం పత్రికలే. ఇప్పుడు పత్రికలు, టీవీ ఛానెళ్లు ఆ పాత్రను, బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. మీడియా ఎఫ్పుడూ కూడా…

మీడియా అంటే.. మన సమాజంలో ఒక గౌరవం ఉంది. ఇదివరకటి రోజుల్లో అయితే మీడియా అంటే కేవలం పత్రికలే. ఇప్పుడు పత్రికలు, టీవీ ఛానెళ్లు ఆ పాత్రను, బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. మీడియా ఎఫ్పుడూ కూడా ప్రజల పక్షానే ఉంటుంది.

ప్రభుత్వం వీసమెత్తు తప్పు చేసినా వారిని విమర్శించడంపై దృష్టి పెడుతుంది. నిశిత విమర్శలతో ప్రభుత్వ పనితీరు మారేందుకు కూడా కారణం అవుతుంటుంది. అయితే ఎన్ని విమర్శలు చేసినా.. ప్రభుత్వాల మీద కక్ష కట్టి మీడియా పోరాడినా.. ఒక గౌరవప్రదమైన తీరులోనే వారి పోకడలు, విధానాలు ఉంటాయి.

గౌరవప్రదమైన విశ్వసనీయమైన సమాచారాన్ని మాత్రమే అందించాలనే ఒక కట్టుబాటు ఉంటుంది. (ఇవాళ ఇదంతా దారితప్పుతుండడం వేరే విషయం) మీడియాలో రాసే వార్తలకు వాడే భాష కూడా కొంత గౌరవప్రదంగానే ఉండాలి, ఉంటుంది. సహేతుకమైన విమర్శ మాత్రమే ఉండాలనే బాధ్యత మీడియాకు ఉంటుంది. రాజకీయ నాయకులు వాడే చిల్లర భాష, రోడ్డు మీద జనం ఎడాపెడా తిట్లతో వాడే లేకి భాష మీడియాలో మనకు కనిపించవు. ఇదంతా ప్రధాన మీడియా స్రవంతి గురించి!

సోషల్ మీడియా సంగతి వేరు! సోషల్ మీడియాలో ఎవరు ఏ రకంగా అయినా మాట్లాడొచ్చు. పచ్చి బూతులతో వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. సహేతుకుతతో వారికి నిమిత్తం లేదు. ఎలాంటి అర్థం పర్థం లేని మాటలనైనా సరే.. వారు వాడేస్తారు. చూడడానికి వినడానికి ఆసక్తికరంగా ఉంటే చాలు.. అది పద్ధతిగా ఉండాలనే నియమం సోషల్ మీడియాకు లేదు. పంచ్ డైలాగ్ ఉంటే చాలు.. వెర్రిగా వ్యాఖ్యానించి ట్రోల్ చేయడమే. ఈ  సోషల్ మీడియా ట్రోల్స్ అన్నీ కూడా దిగజారుడు రకానికి చెందిన సెకండ్ గ్రేడ్ మాటలు!

ప్రధాన స్రవంతి మీడియాకు ఉండే బాధ్యత వేరు. అది ఒక సంస్థ అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది గనుక ఆ బాధ్యత తీసుకుంటారు. కానీ సోషల్ మీడియా చెలరేగడానికి కారణం అది వ్యక్తి వేదిక కావడం. ఇష్టమొచ్చింది పిచ్చిగా పెట్టేస్తుంటారు. అలాంటి పిచ్చి మాటలు మెయిన్ మీడియా చెప్పడం కష్టం. అందుకే సోషల్ మీడియాలో ఎవడేది అన్నా.. దాన్ని ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకోదు. 

కానీ ఇప్పుడు ప్రధాన మీడియా మొత్తం.. జగన్ ప్రభుత్వం మీద పిచ్చి వ్యాఖ్యలు  చేయాలని, అడ్డగోలు నేలబారు చవక కామెంట్లతో విమర్శించాలని ఆరాటపడుతోంది. తాము అలా చీప్ గా మాట్లాడితే పరువు పోతుందని భయం. మధ్యేమార్గంగా సోషల్ మీడియాలో ఇలా వస్తున్నాయి, అలా ట్రోల్ అవుతున్నాయి.. అంటూ అక్కడ ట్రోల్ అవుతున్న వాటిని వైరల్ అవుతున్న వాటిని మళ్లీ మెయిన్ మీడియాలో వండి వార్చే ప్రయత్నం చేస్తున్నారు.

కొండొకచో.. ప్రధాన మీడియాకు చెందిన వాళ్లే చవకబారు కామెంట్లు, పంచ్ లతో ట్రోల్స్ తయారుచేసి వాటిని వైరల్ చేసి… మళ్లీ తామే ప్రధాన మీడియాలో వాటిగురించి వార్తలు రాస్తూ, టీవీ ప్రోగ్రాములు వేస్తూ.. మరింత ప్రమోట్ చేస్తున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చే వాటిని మళ్లీ పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. 

జగన్ మీద బురద చల్లడానికి అత్యుత్సాహపడే పచ్చ మీడియా చేస్తున్న శతకోటి కుట్రలకు ఇలాంటి అనంత కోటి ఉపాయాలు తోడు అవుతున్నట్లున్నాయి.