జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ప‌ట్టించుకోని ఎల్లో మీడియా

జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ ఆగ్ర‌హంగా ఉన్నారనేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఎందుకంటే వారి ఆలోచ‌న‌ల్ని ఎల్లో మీడియా ప్ర‌తిబింబిస్తుంటుంది. తాజాగా ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఆయ‌న ఘాట్‌లో ప‌లువురు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు. ఎన్టీఆర్‌కు…

జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ ఆగ్ర‌హంగా ఉన్నారనేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఎందుకంటే వారి ఆలోచ‌న‌ల్ని ఎల్లో మీడియా ప్ర‌తిబింబిస్తుంటుంది. తాజాగా ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఆయ‌న ఘాట్‌లో ప‌లువురు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు. ఎన్టీఆర్‌కు నివాళుల‌ర్పించిన ఆయ‌న కుటుంబ స‌భ్యుల ఫొటోల‌ను ప్ర‌చురించ‌డంలో ఎల్లో మీడియా టీడీపీ మ‌న‌సెరిగి ప్ర‌వ‌ర్తించ‌డం గ‌మ‌నార్హం.

నంద‌మూరి బాల‌కృష్ణ‌, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి దంప‌తుల‌కు మాత్ర‌మే ఎల్లో మీడియా ప్రాధాన్యం ఇచ్చింది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, ఆయ‌న సోద‌రుడు క‌ల్యాణ్‌రామ్ ఒకేసారి వెళ్లి త‌మ తాత‌కు నివాళుల‌ర్పించినా, ఎల్లో మీడియాలో వారి ఫొటోకు స్థానం లేదు. ఇక నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తికి ఎటూ చోటు వుండ‌ద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారికి ప్రాధాన్యం ద‌క్క‌డం విశేషం. ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వి నుంచి దించ‌డంలోనూ, అలాగే చంద్ర‌బాబుకు వెన్నుద‌న్నుగా నిలవ‌డంలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, నంద‌మూరి బాల‌కృష్ణ పాత్ర గురించి అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్లే ఎన్టీఆర్ అంటే… ఆహా, ఓహో అంటూ పొగ‌డ్త‌లు కురిపించ‌డం, వాటికి విశేష ప్రాధాన్యం క‌ల్పించ‌డం… అంతా చంద్ర‌మాయ‌. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వ్యూహాత్మ‌కంగా టీడీపీ, ఎల్లో మీడియా త‌ప్పించ‌డం వెనుక‌, బ‌ల‌మైన రాజ‌కీయాలు కార‌ణాలున్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

లోకేశ్‌కు ప‌ట్టాభిషేకం చేసే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. దీంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరు బ‌లంగా వినిపిస్తోంది. అందుకే జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు టీడీపీతో ఏంటి సంబంధం అని ఎల్లో మీడియా చంద్ర‌బాబు క‌ళ్ల‌లో ఆనందం చూసేందుకు రాజ‌కీయ దాడి చేస్తోంది. చివ‌రికి త‌న తాత‌కు నివాళుల‌ర్పించిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌  ఫొటోను కూడా లేపేశారంటే… బాబు, లోకేశ్‌ ఎంత‌గా భ‌య‌ప‌డుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.