చాలా మంది ముఖ్యమంత్రి కొడుకులకు అయాచితంగా డబ్బులు వచ్చాయి.. అయితే వారిలో ఎవ్వరూ ఆ డబ్బుతో సక్సెస్ ఫుల్ వ్యాపార సామ్రాజ్యాలను ఏర్పరచలేదు. సాక్షి, భారతీ సిమెంట్ జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ లే. వ్యాపారవేత్తగా జగన్ చాలా తెలివైన వాడు… ఇదొక చౌదరి గారి మాట. అది కూడా జగన్ ను నిరంతరం ద్వేషించే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ఈ చౌదరి. ఈయన మరెవరో కాదు సుజనా చౌదరి. మరి ఆయన ఈ మాట చెప్పింది ఎక్కడో కాదు.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలోనే!
ఇందులో మొదటి ఆశ్చర్యం ఏమిటంటే.. మొన్నటి వరకూ సాక్షిని, భారతీ సిమెంట్ ను అవినీతికి మొలిచిన మొక్కలుగా చెప్పే వారు వీళ్లంతా. శూన్యంలోచి సాక్షి భూతం పుట్టిందంటూ వ్యంగ్య హెడ్డింగులు పెట్టారు! అంతేనా.. జగత్ కంత్రీ అని.. ఇలా నోటికొచ్చిన ప్రాసలు వాడారు. జగన్ మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యం అంతా అవినీతిమయమే అని వాదించారు! సీబీఐ కేసులు, ఈడీ విచారణలు అంతా తెలిసిన సంగతులే.
అయితే.. తాము పెట్టుబడి పెట్టాం మొర్రో అని జగన్ కంపెనీల్లో వాటాదారులు అయిన పారిశ్రామిక వేత్తలు మీడియా ముందు, కోర్టు ముందు, ఈడీ ముందు, సీబీఐ ముందు వాదిస్తూనే ఉన్నారు! లంచాలకు ఎవ్వరైనా డివిడెంట్లు, షేర్లు, లాభాలు ఇస్తారా? అంటూ వారు కోర్టుల ముందు పత్రాలను పెట్టారు. మరి వాటిపై ఒక వైపు విచారణ కొనసాగుతూ ఉంది. ఈ కేసుల్లో .. విచారణను ఎదుర్కొన్న పారిశ్రామిక వేత్తలు డిశ్చార్జి పిటిషన్లలో కొందరు సఫలీకృతం అయ్యారు. అయినా..అవినీతే జరిగి ఉంటే, నాడు నిర్ణయాలు తీసుకున్న మంత్రుల మీద కేసులు పెట్టకుండా.. ఎలాంటి ప్రభుత్వ పదవుల్లో లేని జగన్, పారిశ్రామిక వేత్తలపై కేసులు ఏమిటనేది పాత వాదనే!
ఇదంతా పుష్కరకాలంగా జరుగుతున్న వ్యవహారమే. ఇందులో కొత్తగా చెప్పేదేమీ లేదు. ఇలాంటి నేపథ్యంలో ఒకానొక చౌదరిగారు, చంద్రబాబు శ్రేయోభిలాషిగారు.. సాక్షి, భారతీ సిమెంట్ లు జగన్ సమర్థతకు రుజువులన్నారు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రి తనయులకు ఈజీ మనీ వచ్చినా వారు జగన్ లా నిరూపించుకోలేకపోయారంటూ కూడా విశ్లేషించారు!
మరి జగన్ అవినతికి నిదర్శనం అని చెప్పిన అంశాలనే ఇప్పుడు జగన్ సమర్థతకు నిదర్శనం అంటూ స్వయంగా చౌదర్లు, చంద్రబాబు శ్రేయోభిలాషులు చెప్పుకురావడం గమనార్హం. ప్రత్యేకించి వారి మాటల్లో వ్యంగ్యం లేదిప్పుడు రియలైజేషన్ లాగుంది!