విశాఖ నుంచి పరిపాలనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చి చెప్పారు. ఇంతకాలం ఇదిగో, అదిగో అంటూ చెబుతున్నప్పటికీ, ఎప్పటి నుంచి అనేది స్పష్టత లేదు. ఆ మధ్య ఒకసారి దసరా నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఇప్పుడు దసరా వచ్చినా పరిపాలన మాత్రం మొదలు కాలేదు. అయితే స్వయంగా సీఎం జగన్ విశాఖ నుంచి పాలన సాగించడంపై స్పష్టత ఇవ్వడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలు చెబుతోంది. ఇందులో భాగంగా విశాఖలో పరిపాలన, అమరావతిలో శాసన, రాయలసీమలో న్యాయ రాజధానులు ఏర్పాటు చేసేందుకు చట్టసభలో బిల్లులు సైతం ఆమోదించారు. రాజధాని కోసమో భూములు ఇచ్చామని, ప్రభుత్వం మారితే రాజధాని మారిస్తే తమ బతుకులు ఏం కావాలని అక్కడ భూములిచ్చిన వారు లబోదిబోమంటున్నారు.
పాదయాత్రలు, ధర్నాలు, రాస్తారోకోలు… ఇలా అనేక విధాలుగా రాజధాని రైతుల పేరుతో నిరసనలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మూడు రాజధానుల బిల్లుల్ని ఏపీ హైకోర్టు కొట్టిపడేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం కోర్టు పరిధిలో వుంది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి పరిపాలన సాగించాలన్న ప్రభుత్వ ఆశయం నెరవేరలేదు.
తాజాగా విశాఖ నుంచి పాలన సాగించడంపై జగన్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. ఈ క్రమంలో విశాఖలో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో ప్రభుత్వ శాఖలన్నింటిని అక్కడికి తరలించే వ్యూహ రచన చేసింది. ఇవాళ విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటించారు.
విశాఖలో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నూతన కార్యాలయాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగించనున్నట్టు చెప్పారు. డిసెంబర్‌లోపు విశాఖ నుంచి పరిపాలన సాగిస్తానని ఆయన వెల్లడించారు. పరిపాలన విభాగం అంతా విశాఖకు షిప్ట్ అవుతుందన్నారు. సీఎం జగన్ చెప్పిన ప్రకారం కొత్త ఏడాది మొదలయ్యే నాటికి విశాఖ నుంచి పాలన చూడొచ్చన్న మాట.