వైఎస్ కొండారెడ్డి… వైఎస్ కుటుంబ సభ్యుడు. గత మే నెలలో ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీ అధికారులను బెదిరించిన కేసులో జైలు పాలయ్యాడు. కొండారెడ్డి వ్యవహార శైలితో తనకు అప్రతిష్ట వస్తోందని ఆందోళనకు గురైన సీఎం వైఎస్ జగన్… వెంటనే ఆయనపై జిల్లా బహిష్కరణకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో మే 11న జైలు నుంచి విడుదలైన వైఎస్ కొండారెడ్డిపై జిల్లా బహిష్కరణ వేటు వేసినట్టు కలెక్టర్, ఎస్పీ ప్రకటించారు.
అప్పటి నుంచి ఆయన కడప జిల్లాలో కనిపించడం లేదు. హైదరాబాద్, బెంగళూరుల్లో ఉన్నాడనే ప్రచారం తప్ప, మనిషి మాత్రం కనిపించలేదు. అకస్మాత్తుగా ఆయన పులివెందుల నియోజకవర్గంలో ప్రత్యక్ష కావడం చర్చనీయాంశమైంది. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలానికి చెందిన వైసీపీ నాయకుడిని ఆయన కలిశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటికొచ్చాయి.
ఆ తర్వాత వెంటనే జిల్లా వదిలి వెళ్లాడు. ఇంకా బహిష్కరణను తొలగించకనే వైఎస్ కొండారెడ్డి జిల్లాకు రావడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ రెండురోజుల్లో పులివెందుల రానున్న నేపథ్యంలో కొండారెడ్డి అక్కడ కనిపించడంపై రకరకాల చర్చకు దారి తీసింది. మరీ ముఖ్యంగా నూతన సచివాలయ భవన ప్రారంభం కోసం సీఎం వేముల వెళ్లనున్నారు.
అదే మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులతో కొండారెడ్డి భేటీ కావడం గమనార్హం. తనపై జిల్లా బహిష్కరణ వేటు ఎత్తివేయాలని సీఎంపై ఒత్తిడి తేవాలని వైసీపీ నాయకులను కొండారెడ్డి కోరారా? అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది.