ప్ర‌జాకోర్టులో సునీత వ‌ర్సెస్ వైఎస్ జ‌గ‌న్‌!

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిదానికి పాల్ప‌డిందా? అంటే…. ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. అసెంబ్లీ వేదిక‌గా సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు… ఈ కేసులో బాధితులు, అలాగే హ‌త్యానేర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో వైసీపీ వ్యూహాత్మ‌క త‌ప్పిదానికి పాల్ప‌డిందా? అంటే…. ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. అసెంబ్లీ వేదిక‌గా సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు… ఈ కేసులో బాధితులు, అలాగే హ‌త్యానేర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారు దాయాదులే. జ‌గ‌న్‌కు రెండు క‌ళ్ల లాంటి వారు. హ‌త్య‌కు గురైంది సీఎం జ‌గ‌న్‌కు స్వ‌యాన చిన్నాన్న‌. అలాగే హ‌త్య‌లో ప్ర‌ధాన పాత్ర‌దారులనే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, ఆయ‌న కుమారుడు వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా జ‌గ‌న్‌కు సొంత వాళ్లే. వ‌రుస‌కు జ‌గ‌న్‌కు భాస్క‌ర్‌రెడ్డి చిన్నాన్న‌, అలాగే అవినాష్‌రెడ్డి త‌మ్ముడు అవుతారు.

త‌న తండ్రిని కిరాత‌కంగా చెప్ప‌డాన్ని వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత జీర్ణించుకోలేకున్నారు. ఎలాగైనా దోషుల‌కు శిక్ష ప‌డేలా చేయాల‌ని ఆమె ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ప్రాణాల‌కు తెగించి న్యాయ పోరాటం సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమె దాదాపు విజ‌య తీరాల‌కు చేరుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల‌ను కాపాడేందుకు అధికార పార్టీ వైసీపీ శ‌క్తివంచ‌న లేకుండా పోరాటం చేస్తోంది.

సీబీఐ విచార‌ణ పూర్తిగా త‌ప్పుదోవ‌లో సాగుతోంద‌న్న‌ది అధికార పార్టీ వాద‌న‌. అవినాష్‌రెడ్డి, భాస్క‌ర్‌రెడ్డి నిర్దోషుల‌ని వైసీపీ బ‌లంగా వాదిస్తోంది. దీంతో ఇదంతా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లోనే సాగుతోంద‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. ఇదే వైసీపీకి రాజ‌కీయంగా న‌ష్టం తెస్తోంది. ఎందుకంటే వైసీపీ వాద‌న‌కు పూర్తిగా భిన్న‌మైన అభిప్రాయం ప్ర‌జ‌ల్లో వుంది. అందుకే వైఎస్ జ‌గ‌న్‌పై కూడా వ్య‌తిరేక‌త తెస్తోంది.

నిజానికి ఈ విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ త‌ట‌స్థ వైఖ‌రి తీసుకుని వుంటే బాగుండేద‌ని ఆయ‌న శ్రేయోలాషుల అభిప్రాయం. దోషులెవ‌రో తేల్చే బాధ్య‌త‌ను సీబీఐకి వ‌దిలేసి వుంటే జ‌గ‌న్‌కు మంచి పేరు వ‌చ్చి వుండేది. కానీ సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని హైకోర్టులో వేసిన పిటిష‌న్‌ను సీఎం జ‌గ‌న్ వెన‌క్కి తీసుకోవ‌డంతో మొద‌టి త‌ప్ప‌ట‌డుగు ప‌డింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ త‌ర్వాత డాక్ట‌ర్ సునీత పోరాటంతో సీబీఐ విచార‌ణ‌కు న్యాయ‌స్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాద‌న‌లేని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి.

వైఎస్ వివేకానంద‌రెడ్డికి క‌డ‌ప జిల్లాలో మంచి పేరు వుంది. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న చొర‌వ చూపేవారు. ఎవ‌రు పిలిచినా ప‌లికేవారు. సౌమ్యుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నాయ‌కుడిని అత్యంత అమాన‌వీయంగా చంప‌డాన్ని పౌర స‌మాజం జీర్ణించుకోలేక‌పోతోంది. ఈ హ‌త్య‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల‌పై విచార‌ణ స‌జావుగా సాగాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటున్నారు.

అయితే వ్య‌క్తిగ‌త అభిమానంతో వారిని వెనకేసుకు రావాల్సిన అవ‌స‌రం ఏంట‌నేది జ‌గ‌న్ విష‌యంలో పౌర స‌మాజం వేస్తున్న ప్ర‌శ్న‌. విచార‌ణ సాగుతున్న ద‌శ‌లో అధికార పార్టీ త‌న సొంత అభిప్రాయాల్ని రుద్ద‌డం, అలాగే అడ్డు త‌గులుతోంద‌న్న అభిప్రాయాన్ని క‌లిగించ‌డ‌పై స‌హ‌జంగానే పులివెందుల‌లో సైతం వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. బాధితురాలైన సోద‌రి సునీత ప‌క్షాన వైఎస్ జ‌గ‌న్ నిల‌బ‌డ‌కపోవ‌డం చివ‌రికి సొంత కుటుంబంలో కూడా అసంతృప్తికి దారి తీసింది. ఇవ‌న్నీ పైకి క‌నిపించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, అంత‌రాంత‌రాల్లో ఘ‌ర్ష‌ణ జ‌రుగుతోంది.

వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌లో భాగంగా సీబీఐకి త‌మ ప్ర‌భుత్వం నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు వుంటుంద‌ని వైసీపీ స‌ర్కార్ చెప్పి వుంటే… ఇవాళ క‌థ వేరేలా వుండేది. జ‌గ‌న్ హీరో అయ్యేవారు. కానీ కార‌ణాలు ఏవైనా జ‌గ‌న్ పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌న్న విమ‌ర్శ‌ను ఎదుర్కొంటున్నారు. ఈ వైఖ‌రి రాజ‌కీయంగా ఎంత న‌ష్ట‌మో రానున్న రోజుల్లో కాలం జ‌వాబు చెబుతుంది. వివేకా హ‌త్య కేసు విష‌యంలో ముఖ్యంగా క‌డ‌ప జిల్లా ప్ర‌జానీకం గుంభ‌నంగా చూస్తూ వుంది.

ప్ర‌స్తుతం న్యాయ స్థానంలో డాక్ట‌ర్ సునీత వ‌ర్సెస్ వైఎస్ అవినాష్‌రెడ్డి పోరాటం సాగ‌డ‌మే చూస్తున్నాం. కానీ వివేకా హ‌త్య కేసు పుణ్య‌మా అని ప్ర‌జాకోర్టులో డాక్ట‌ర్ సునీత వ‌ర్సెస్ వైఎస్ జ‌గ‌న్ మ‌ధ్య పోరు చూడాల్సి వుంటుంది. క‌డ‌ప జిల్లా ప్ర‌జానీకంతో వైఎస్ వివేకానంద‌రెడ్డికి విడ‌దీయ‌ని అనుబంధం వుంది. త‌న త‌మ్ముడిని క‌డ‌ప జిల్లాలో స్వామి వివేకానందతో స‌మానంగా చూస్తార‌ని అసెంబ్లీ వేదిక‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చెప్పిన సంగ‌తి తెలిసిందే. వివేకా వ్య‌క్తిగ‌త బ‌ల‌హీన‌త‌ల గురించి ఇప్పుడే ఎందుకు చ‌ర్చ జ‌రుగుతున్న‌దో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

కార‌ణాల‌న్నీ అంద‌రికీ తెలిసిన‌వే. వివేకా హ‌త్య త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను ప్ర‌జ‌లు క్షుణ్ణంగా గ‌మ‌నిస్తున్నారు. న్యాయ‌స్థానాల్లో న్యాయం జ‌ర‌గ‌డం ఒక్కో సారి చాలా సంవ‌త్స‌రాలు ప‌ట్టొచ్చు. కానీ రాజ‌కీయాల్లో ఐదేళ్ల‌కో సారి ప్ర‌జాకోర్టు తీర్పును ఎదుర్కోవాల్సి వుంటుంది. వివేకా విష‌యంలో తీర్పు ఇవ్వ‌డానికి ప్ర‌జాకోర్టు సిద్ధంగా వుంది. ఇందుకు మ‌రో ఏడాది మాత్ర‌మే గ‌డువు వుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా వివేకా హ‌త్య కేసుపై ఎవ‌రి వాద‌న‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారో తేల‌నుంది. దీన్ని సానుకూల‌, ప్ర‌తికూల ఫ‌లితాల‌ను ఎదుర్కోడానికి సీఎం వైఎస్ జ‌గ‌న్‌, డాక్ట‌ర్ సునీత సిద్ధంగా వుండాలి.