జూన్ తొమ్మిదిన పండుగ ఏమిటి అన్నది అందరిలో డౌట్ గా రావచ్చు. తిథుల ప్రకారం చూస్తే పండుగలు ఏమీ లేవు. కానీ అతి పెద్ద రాజకీయ పండుగకు అంతా సిద్ధం కండి అని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖలో జూన్ 9వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణం చేస్తారని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.
అతి పెద్ద వేడుకగా విశాఖలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. వైసీపీ మరోసారి భారీ మెజారిటీతో ఏపీలో అధికారం చేపడుతుంది అని ఆయన చెప్పారు. వైసీపీది ధీమా అయితే టీడీపీది ఆడంబరం అని ఆయన ఎద్దేవా చేశారు.
మేమే గెలుస్తామని చంద్రబాబు మేకపోతు గాంభీర్యంతో ప్రకటిస్తున్నారు తప్ప నిజంగా కూటమికి అంత సీన్ లేదని బొత్స తేల్చేశారు. విశాఖకు చెందిన మరో మంత్రి గుడివాడ అమర్నాధ్ అయితే వైసీపీని నూటికి ఎనభై శాతం ఓటర్లు మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నారని చెప్పారు.
ఎక్కువ ఎంపీ సీట్లు కూడా వైసీపీ గెలుస్తోందని ఆయన ప్రకటించారు. తమ ఎంపీలు కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారు అన్న దాని మీద ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఈసారి ఏ కూటమికీ పూర్తి స్థాయిలో మెజారిటీ సీట్లు రాకుండా ఉండాలని ఆయన అన్నారు.
అలా అయితేనే తమ మద్దతు కీలకం అవుతుందని అపుడు ఏపీ ప్రయోజనాలకు కట్టుబడిన కూటమికే వైసీపీ మద్దతు ఇస్తుదని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీయే కానీ ఇండియా కూటమి కానీ ఎవరు అయినా తమకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని గుడివాడ చెప్పడం విశేషం.
ఈసారి కేంద్రంలో ఎవరికైనా ప్రభుత్వ స్థాపనకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాదని, అందువలన అత్యధికంగా ఎంపీలను గెలుచుకుంటున్న వైసీపీ ఎంపీల మద్దతు అవసరం ఆయా పార్టీలకు ఉంటుందని అమర్నాథ్ విశ్లేషించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు, రాష్ట్ర ప్రయోజనాలను ముడిపెట్టిన మీదటనే తాము ఆయా పార్టీలకు మద్దతు ఇస్తామని అమర్నాథ్ తెలియజేశారు. కేంద్రంలో ఏ పార్టీకైనా వైసిపి ఎంపీల అవసరం కచ్చితంగా ఉంటుందని అమర్నాథ్ స్పష్టం చేశారు.