ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు మోకరిల్లాయనే విమర్శలున్నాయి. వాటికి తగ్గట్టే ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు నడుచుకుంటున్నాయి. తాజాగా ఆ విషయంలో అధికార పార్టీ వైసీపీ మోదీ సర్కార్‌పై విశ్వాసం ప్రకటించడంలో అత్యుత్సాహం ప్రదర్శించింది. ఎంతగా అంటే… కనీసం అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా తమకు అండగా నిలవాలని బీజేపీ కోరకుండానే మద్దతు ప్రకటించడం వైసీపీకే చెల్లింది.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇంకొంచెం ముందడుగు వేసి, జాతీయ మీడియాతో మాట్లాడుతూ విపక్షాలు కేంద్రానికి మద్దతుగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. మణిపూర్‌లో మహిళలపై దారుణ అఘాయిత్యాలు, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మోదీ సర్కార్‌పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టాయి.
ఈ అవిశ్వాస తీర్మానానికి ఏపీలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ మద్దతు ఇస్తాయని అందరికీ తెలుసు. ఇందులో రహస్యమేమీ లేదు. అయితే మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుని తిరగరు కదా! అబ్బే… తాను తిరుగుతానని వైసీపీ అంటోంది. లోక్‌సభ, రాజ్యసభలలో వైసీపీకి బలం వుంది. ఆ పార్టీ అవసరం బీజేపీకి ఎంతో వుంది. వైసీపీ మద్దతును బీజేపీ తప్పక అడుగుతుంది.
కనీసం అడిగేంత వరకూ వైసీపీ ఓపిక పట్టలేదు. విజయసాయిరెడ్డి మాటలు వింటే… తమ ప్రభుత్వంపైనే విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినట్టుగా ఉన్నాయి. జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దులో ఉన్న మణిపూర్‌లోని వివాదాస్పద అంశంపై కేంద్రానికి మద్దతుగా విపక్షాలు కలిసి రావాలని కోరారు.
సరిహద్దు దేశాల కుట్రల దృష్ట్యా సమష్టిగా వుండాల్సిన అవసరం ఉందన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ సమాఖ్య స్ఫూర్తిని ఏ మాత్రం దెబ్బతీయడం లేదని ఆయన అన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు తీర్పును ఏ మాత్రం ఉల్లంఘించడం లేదన్నారు. అందువల్లే ఈ రెండు అంశాలపై కేంద్రానికి వైసీపీ మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు.
కేంద్రానికి మద్దతు ఇవ్వడానికి సాకులు చెప్పడంలో వైసీపీ, టీడీపీలకు ఏ పార్టీ సాటి రాదు, రాబోదు. దేశంలో వెన్నెముక లేని పార్టీలు ఏవైనా వున్నాయంటే …అందరి వేళ్లు, చూపు ఆంధ్రప్రదేశ్ వైపే. అంతగా మోదీ సర్కార్ అంటే మన పార్టీలు భయపడుతున్నాయి. కనీసం మోదీ సర్కార్ అడిగేంత వరకైనా వైసీపీ సంయమనం పాటించకపోగా, విపక్షాల మద్దతు కోరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు వైసీపీ సర్కార్‌పై ఏపీ బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, విచారించి చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు పురందేశ్వరి నేతృత్వంలో ఫిర్యాదు చేశారు. ఇవన్నీ డ్రామాలా? ఎవరిని వంచించడానికి ఈ చేష్టలన్నీ!.