వైసీపీ గెలుపు మంత్రం ఏంటో విపక్షానికి అర్ధం అయింది. ఏ సర్వేల అవసరం లేకుండా అధికార పార్టీ సత్తా ఏంటో కూడా బోధపడుతోంది. అందుకే పూటకొక నేత జనంలోకి వస్తే చాలు వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ పధకాలు మేము ఇస్తామని చెబుతున్నారు.
ఏపీలో మూడు నాలుగేళ్ళ పాటు విపక్షం అంతా కోరస్ గా అన్న మాటలు అందరికీ తెలుసు. ఈ రోజుకూ అవి జనం చెవిలోనే ఉన్నాయి. ఏపీ శ్రీలంకగా మారిపోతుంది. ఏపీని ఇక అమ్మేయడమే తరువాయి అన్నంతగా హడలెత్తించారు, జగన్ గుండెలలో దడ పుట్టించారు.
ఇపుడు మాత్రం వైసీపీ పధకాల కంటే రెట్టింపు అని ఊరిస్తున్నారు. మమ్మల్ని ఎన్నుకోండి డబుల్ త్రిబుల్ స్కీములు అని ఊరిస్తున్నారు. ఏపీ అప్పుల కుప్ప అని ఒక వైపు చెబుతూనే టీడీపీ అధినేత సూపర్ సిక్స్ అని ఉచిత పధకాల గురించి ఊదరగొడుతున్నారు.
జనసేన కూడా ఏమీ తీసిపోవడం లేదు. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన రూపంలో మేము అధికారంలోకి వస్తే ఇంకా గొప్పగా సంక్షేమ పధకాలు అమలు చేసి చూపిస్తామని చెప్పారు. ఇపుడు అన్న నాగబాబు వంతు. ఆయన ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తూ సంక్షేమ పధకాల గురించే చెబుతున్నారు.
వైసీపీ కంటే రెట్టింపు పధకాలు అమలు చేస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. ఉచిత వైద్యం అంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ జగన్ పధకాలు అమలుకే ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. దానికే అప్పుల మీద అప్పులు తెస్తూ ఏపీ తిప్పలు పడుతూంటే శ్రీలంక అంటూ భయపెట్టింది ఇవే ప్రతిపక్ష గొంతులు.
ఇపుడు రెట్టింపు పధకాలు అనుకున్నా సూపర్ సిక్స్ అని చెప్పుకున్నా వాటికి ఏటా అయ్యే ఖర్చు అక్షరాలా లక్షన్నర కోట్ల రూపాయలు. ఏపీ బడ్జెట్ లో సగం కంటే ఎక్కువ అన్న మాట. అంత పెద్ద మొత్తంలో ఏటా ఖర్చు చేయడానికి రేపటి రోజున విపక్షం అధికారంలోకి వచ్చినా వీలు అవుతుందా అన్నది పెద్ద సందేహం.
టీడీపీ అనుకూల మీడియాతో పాటు ఆ పార్టీ పెద్దలు తరచూ అనే మాట కోరస్ గా ఒకటి ఉంది. సంపద పెంచేస్తామని. సంపద అన్నది అల్లా ఉద్దీన్ అద్భుతం కాదు కదా ఒక్క రోజులో పెరగడానికి. అయిదేళ్ల అతి తక్కువ టైంలో అద్భుతాలు ఏవీ జరగవు. అంటే జగన్ తెచ్చిన అప్పుల కంటే ఎక్కువ తెచ్చి శ్రీలంకను మించిపోయేలా ఏపీని చేయడం ఒక మార్గం.
లేదూ అంటే అధికారంలోకి వచ్చాక ఉచిత పధకాలకు తూచ్ అంటూ చేతులెత్తేయడం. ఇటీవల అసెంబ్లీలో ఇదే విషయం ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. హామీలు నెరవేర్చాలన్న నిబద్ధత ఉంటే కదా అందుకే ఎన్ని హామీలైనా ఇస్తారు అని. చూడబోతే ఆయన మాటలే నమ్మాలేమో. జనాలకు కూడా ఈ సంగతి తెలియదు అని అనుకుంటే ఇంకా ఎన్నికలు అయ్యేలోగా ఎన్ని అయినా హామీలు గుది గుచ్చి జనం ముందు పెట్టవచ్చు కూడా.