Advertisement

Advertisement


Home > Politics - Andhra

అంద‌రి టార్గెట్ జ‌గ‌నే!

అంద‌రి టార్గెట్ జ‌గ‌నే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చిత్ర‌విచిత్ర రాజ‌కీయాలు సాగుతున్నాయి. అంద‌రికీ వైఎస్ జ‌గ‌నే టార్గెట్‌. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, కాంగ్రెస్‌, చివ‌రికి వామ‌ప‌క్షాల‌కు కూడా వైఎస్ జ‌గ‌నే శ‌త్రువు. ఏపీ రాజ‌కీయ తెరపై నుంచి జ‌గ‌న్ అనే నాయ‌కుడిని లేకుండా చేస్తేనే అంద‌రికీ నిద్ర‌ప‌ట్టేలా వుంది. వీళ్లంద‌రికీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల త‌న భుజాన్ని ఇచ్చింది. రాజ‌కీయంగా జ‌గ‌న్‌ని కాల్చ‌డానికి.

మంగ‌ళ‌గిరిలో ఈ నెల 8న వైఎస్సార్ జ‌యంతిని ష‌ర్మిల ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ క‌డ‌ప‌లో ఉప ఎన్నిక వ‌స్తుంద‌ని, తానే ఇంటింటికీ వెళ్లి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తాన‌ని, కాంగ్రెస్ విజ‌యాన్ని వైఎస్సార్ పుట్టిన గ‌డ్డ నుంచే మొద‌లు పెడ‌తామ‌ని భారీ డైలాగ్‌లు కొట్టారు. రేవంత్‌రెడ్డి  తాజా మాట‌ల కంటే పావురాల గుట్ట‌లో పావుర‌మై పోయావ‌ని గ‌తంలో టీడీపీ నాయ‌కుడిగా వైఎస్సార్‌ను ఉద్దేశించి అన‌డాన్ని వైసీపీ శ్రేణులు, ఆయ‌న అభిమానులు గుర్తు చేస్తున్నారు.

అలాగే ఎల్లో మీడియా అధిప‌తికి కొంత కాలం క్రితం తెలంగాణ సీఎంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పార్టీ ఫిరాయింపుల‌కు తెర‌లేపిన వైఎస్సార్.. ప్ర‌కృతి కోపానికి గురై పోయార‌న్న మాట‌లు ఆయ‌న అభిమానుల మ‌న‌సుల్ని గాయ‌ప‌రిచాయి. సీఎంగా వైఎస్సార్ ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ శ్రేయ‌స్సు కోస‌మే చేశార‌నే విష‌యాన్ని రేవంత్‌రెడ్డి మ‌రిచిన‌ట్టున్నారు.

వేదిక‌ల‌ను బ‌ట్టి రేవంత్‌రెడ్డి అభిప్రాయాల్ని వెల్ల‌డిస్తుంటారు. రెడ్ల స‌భ‌ల‌కు వెళితే, త‌న సామాజిక వ‌ర్గం త‌ప్ప‌, మ‌రే కుల‌పోళ్లు పాల‌కులుగా ప‌నికిరార‌ని మాట్లాడ‌గ‌లిగే స‌మ‌ర్థ‌త కేవలం రేవంత్ సొంతం. ఇలాంటి రేవంత్‌రెడ్డిని తీసుకొచ్చి జ‌గ‌న్‌ను తిట్టిస్తే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ఎవ‌రికి? క‌డ‌ప‌లో జ‌గ‌న్‌ను ఓడిస్తామ‌ని చెప్ప‌డం ద్వారా, చంద్ర‌బాబు క‌ళ్ల‌ల్లో ఆనందాన్ని చూడొచ్చేమో!

కూట‌మి అనుకూల మీడియా ఎక్కువ‌గా వుండ‌డం వ‌ల్ల... వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్ నాయ‌కులెవ‌రైనా ఆ చాన‌ళ్ల చ‌ర్చ‌ల‌కు వెళ్లిన‌ప్పుడు ఆ మీడియా అభిమానించే పార్టీకి అనుకూలంగా మాట్లాడ్డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. తాము ఆరాధించే మీడియాకు అనుకూలంగా మాట్లాడే విశ్లేష‌కుల్ని మాత్ర‌మే పిల‌వ‌డాన్ని చూడొచ్చు.

వామ‌ప‌క్షాల నాయ‌కులు గ‌ఫూర్‌, రామ‌కృష్ణ‌, కె.నారాయ‌ణ త‌దిత‌ర నాయ‌కులు జ‌గ‌న్ ఓడిపోయిన‌ప్ప‌టికీ ఆయ‌న్నే విమ‌ర్శించ‌డాన్ని ఎలా చూడాలి? సిద్ధాంత‌ప‌రంగా తీవ్రంగా వ్య‌తిరేకించే బీజేపీ భాగ‌స్వామ్య ప్ర‌భుత్వం ఏపీలో ఉన్న‌ప్ప‌టికీ, వామ‌ప‌క్షాల‌కు ఎందుకో క‌మ్మ‌గా వుంది. జ‌గ‌న్‌ను రాజ‌కీయ తెర‌పై నుంచి లేకుండా చేయాల‌నే ఏపీలోని అన్ని రాజ‌కీయ ప‌క్షాల కోరిక నెర‌వేర‌డం సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌గా మిగిలింది.

 


  • Advertisement
    
  • Advertisement