Advertisement

Advertisement


Home > Politics - Andhra

అమరావతి మెగా సీరియల్ కు ముగింపు ఎప్పుడు?

అమరావతి మెగా సీరియల్ కు ముగింపు ఎప్పుడు?

ఏపీ రాజధాని అమరావతి మళ్ళీ తెరమీదికి వచ్చింది. వాస్తవం చెప్పాలంటే అమరావతి మెగా సీరియల్ అని చెప్పుకోవచ్చు. ఒక టీవీ మెగా సీరియల్ ఎంత ఉత్కంఠభరితంగా సాగుతుందో అమరావతి కథ అలా సాగుతోంది. జగన్ పరిపాలన పూర్తయ్యేవరకు ఈ కథ ముగిసేలా లేదు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పరిపాలన మంచిచెడుల విశ్లేషణ ఇప్పటికిప్పుడు చేయలేంగానీ ఒకటిమాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.

ఆయన పాలన ఇప్పటివరకు కోర్టు కేసుల చుట్టూనే తిరుగుతోంది. దీనికి తోడు ఆయన అక్రమాస్తుల కేసులు అదనం. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కువభాగం కోర్టుల్లో విచారణను ఎదుర్కొన్నవే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు అనేకమంది ఉన్నతాధికారులు కోర్టుకు వెళ్లినవారే. తప్పు చేశామని లెంపలు వేసుకున్నవారే.

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఒక ప్రధాన విషయం ఏమిటంటే ... నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం, కోర్టులకు వెళ్ళేది అధికారులు. ప్రభుత్వ నిర్ణయాలలో మంచి చెడులను పాలకులకు విడమర్చి చెప్పలేని అధికారులకు ఇలాంటి శాస్తి కావలసిందే.

ఇక అసలు విషయానికొస్తే ....చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజధానిలో కొన్ని పనులు జరిగాయి. ఓ మోస్తరుగా పనులు కూడా పూర్తి చేసుకున్న అమరావతిని కాదని మూడు రాజధానుల వైపు  జగన్ ప్రభుత్వం మొగ్గింది. అయితే దీనిపై అప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో సర్కార్ ప్లాన్ బెడిసికొట్టింది.

అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్ కు గండంగా మారింది. అలాగని దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు.

దీంతో ప్రభుత్వం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోతోంది. అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న వైసీపీ సర్కార్ కు హైకోర్ట్ ఏకంగా ఆరునెలల డెడ్ లైన్ పెట్టి మరీ రాజధాని అభివృద్ధి చేయమంటోంది. దీంతో హైకోర్టు తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వం తీవ్ర మల్లగుల్లాలు పడుతోంది. నిధుల కొరతను సాకుగా చూపుతూ 6 నెలల గడువును 60 నెలలకు పెంచాలంటూ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 

అయితే దీనిపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆ లోపే రైతులు అమరావతిలో పనులు కావడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వాన్ని పనుల స్టేటస్ రిపోర్ట్ కోరింది. అమరావతి రాజధాని అభివృద్ధిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు సాధ్యం కాదంటూ  మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీఎం జగన్ కూడా స్వయంగా అసెంబ్లీలోనే ఎప్పుడో కుండబద్దలు కొట్టేశారు. పైకి మాత్రం హైకోర్టు తీర్పు అమలుకు నిధుల్లేవంటూ అఫిడవిట్ దాఖలు చేశారు.

ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే హక్కు హైకోర్టుకు లేదని ఓవైపు అసెంబ్లీలో చెప్పేసిన ప్రభుత్వం.. పైకి మాత్రం నిధుల లేమి జపం చేస్తోంది. దీంతో హైకోర్టు తీర్పు అమలు జరగడం లేదని భావిస్తున్న రైతులు తిరిగి కేసు వేశారు.

అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ మేరకు ఊరట కోరే అవకాశం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. హైకోర్టు తీర్పేమీ ఫైనల్ కాదు. కానీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రభుత్వం అస్సలు ముందుకు రావడం లేదు.

అలా ఎందుకు చేస్తున్నదో అర్ధం కావడం లేదు. హైకోర్టు తీర్పు తర్వాత న్యాయనిపుణులతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసే విషయమై నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోలేదు. అంటే ఇక సుప్రీంను ఆశ్రయించడం లేదని అర్ధమైపోయింది. అమరావతిపై హైకోర్టు తీర్పు అమలు విషయంలో వైసీపీ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. రైతులకు ఫ్లాట్లు ఇచ్చే విషయంలో కాస్త ముందడుగు వేసిన ప్రభుత్వం.. ఆలస్యానికి పరిహారం కోరుతూ రైతులు వేసిన పిటిషన్ తో తిరిగి ఆత్మరక్షణలో పడింది.

నిధుల కొరత కారణంగా మిగతా భవనాల నిర్మాణం విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. అలాగని వాటిని పూర్తిగా వదిలేసే పరిస్ధితి లేదు. దీంతో మొక్కుబడిగా పనులు ప్రారంభించి కాలయాపన చేస్తోంది. దీంతో పరిస్ధితిని గమనించిన అక్కడి రైతులు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు నిన్న స్టేటస్ రిపోర్ట్ కోరింది. దీంతో ఇప్పుడు రెండు నెలల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. మరి ప్రభుత్వం పనులపై దూకుడు పెంచుతుందా లేక ఇప్పటికైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ముందస్తు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని, భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని హై కోర్టు  ఆదేశించింది. ఆ పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

అంతేకాదు, అమరావతి రాజధాని అవసరాలకు తప్ప ఇతర వేరే పనులకు ఆ భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలని ఆదేశించింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, లేని అధికారాలతో సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయలేరని గుర్తు చేసింది.

అంతేకాదు, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని, పిటిషనర్లందరికీ ఖర్చుల కింద ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ తీర్పు వెలువడి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. 

ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ స‌ర్కారు అమలు చేయటం లేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదని పిటిషన్‌లో రైతులు పేర్కొన్నారు.

నిధులు లేవనే సాకుతో తీర్పు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పిటిషన్ విచారణకు రావడంతో ఏపీ సర్కార్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్ లోని పలు అంశాల‌ను ప‌రిశీలించిన హైకోర్టు…కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని జగన్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. మరి మిగిలిన కథ ఎలా నడుస్తుందో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?