విమానం మంత్రి గారు

టీడీపీకి ఉత్తరాంధ్ర కీ విమానానికి మంచి అనుబంధం ఉంది. అందుకే మళ్లీ మళ్ళీ అదే శాఖ వలచి వరించి వస్తోంది. మోడీ తొలి టెర్మ్ లో పౌర విమానయాన శాఖను విజయనగరం జిల్లాకు చెందిన…

టీడీపీకి ఉత్తరాంధ్ర కీ విమానానికి మంచి అనుబంధం ఉంది. అందుకే మళ్లీ మళ్ళీ అదే శాఖ వలచి వరించి వస్తోంది. మోడీ తొలి టెర్మ్ లో పౌర విమానయాన శాఖను విజయనగరం జిల్లాకు చెందిన ఎంపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజుకు కేటాయించారు.

నాలుగేళ్ళ పాటు ఆయన ఆ శాఖ మంత్రిగా వ్యవహరించారు. కానీ భోగాపురం ఎయిర్ పోర్టు పనులు కూడా ముందుకు సాగని పరిస్థితి ఉండేది. చివరికి టీడీపీ ఎన్డీయేకి రాం రాం అనడంతో రాజు గారు పదవికి రాజీనామా చేశారు. ఈ శాఖ వల్ల గతంలో ఏపీకి ఒనగూడినది ఏదీ లేదని తేలిపోయింది.

ఇపుడు అదే శాఖను కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఇచ్చారు. శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ కి ఈ శాఖ దక్కడంతో ఏపీకి దీని వల్ల ఏమి లాభం అన్న ప్రశ్న మళ్లీ తలెత్తుతోంది. కీలకమైన శాఖలు ఏపీకి దక్కుతాయని ప్రచారం బాగా జరిగింది.

గతంలో ఎర్రన్నాయుడు చేపట్టిన గ్రామీణాభివృద్ధి శాఖను రామ్మోహన్ కి ఇస్తారని అంతా భావించారు. భారీ పరిశ్రమలు, టూరిజం, ఉక్కు వంటి శాఖలు ఇస్తే ఏపీకి ఎంతో కొంత న్యాయం జరిగేది అని అంటున్నారు. పౌర విమానయాన శాఖ వల్ల ఏపీకి ఒరిగేది పెద్దగా ఏమీ ఉండదని పెదవి విరిచేవారే ఎక్కువగా ఉన్నారు.

ఈ శాఖ వల్ల దేశంలో పౌర విమానయాన రంగం అభివృద్ధి జరిగితే జరగవచ్చు కానీ ఏపీకి విభజన సమస్యలతో కునారిల్లిన రాష్ట్రానికి ఉపయోగపడే శాఖలు  ఇస్తే నిధులు దండీగా తెచ్చుకునే వీలు ఉండేదని అంటున్నారు. యంగ్ మినిస్టర్ అయిన రామ్మోహన్ ఇపుడు విమానం మంత్రి గారు అయ్యారు. ఆయన ఈ శాఖలో తన సత్తా చాటుతారని ఆశించాలి. ఆయన మోడీ కేబినెట్ లో ఉంటారు కాబట్టి ఏపీకి విభజన హామీలను తరచూ గుర్తు చేస్తూ ఏమైనా సాధిస్తే అదే పదివేలు అని అంటున్నారు.