Advertisement

Advertisement


Home > Politics - Andhra

బాబు బండారు మధ్యలో మాడుగుల హల్వా!

 బాబు బండారు మధ్యలో మాడుగుల హల్వా!

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ కూటమి రాజకీయం అయోమయంగా సాగుతోంది. అలకలు ఇంకా పోలేదు. అసంతృప్తులు చల్లారలేదు. దాంతో అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న సీఎం రమేష్ మొత్తం సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తోంది. ఆయన ఇప్పటికే అసంతృప్తులు అలకలు ఉన్న వారి ఇళ్ళకు వెళ్ళి చర్చలు జరుపుతున్నారు.

అనకాపల్లి ఏదో ఒక విధంగా కొలిక్కి వచ్చింది. కానీ పెందుర్తి మాత్రం పీట ముడి వేసుకుంది. దాంతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటికి రెండోసారి కూడా సీఎం రమేష్ తాజాగా వెళ్లారు. అది కూడా చంద్రబాబు బండారుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో. బాబుకు ఒక నమస్కారం చేసి బండారు వెళ్ళిపోయినట్లుగా ప్రచారం సాగిన నేపధ్యంలో సీఎం రమేష్ బండారును కలిశారు.

ఆయనకు మాడుగుల అసెంబ్లీ సీటు వచ్చేలా చూస్తామని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదట తనకు పెందుర్తి సీటు మాత్రమే కావాలని డిమాండ్ పెట్టిన బండారు మెల్లగా ఇప్పుడు మాడుగులకు ఓకే చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టారు అని అంటున్నారు. పెందుర్తి టీడీపీ ఇంచార్జ్ గా తన కుమారుడు అప్పలనాయుడుకు బాధ్యతలు అప్పగిస్తే అప్పుడు తాను మాడుగులకు వస్తాను అని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది

దీని మీద టీడీపీ అధినాయకత్వం ఏమంటుందో చూడాలని అంటున్నారు. మాడుగుల చూస్తే ఇప్పటికే మూడు వర్గాలతో సైకిల్ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. అయిదేళ్ల పాటు మాడుగుల ఇంచార్జిగా తన చేత పనిచేయించుకుని టికెట్ దగ్గరకు వచ్చేసరికి ఇవ్వలేదని పీవీజీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అయితే మీడియా ముందు కన్నీరు పెట్టారు. తనకు అన్యాయం చేయవద్దని పార్టీ పెద్దలని ఆయన వేడుకుంటున్నారు. ఎన్నారై పైలా ప్రసాద్ కి టికెట్ అనౌన్స్ చేశారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు నాలుగవ క్రిష్ణుడిగా బండారు దిగితే మరింత గందరగోళంలో టీడీపీ పడుతుందని అంటున్నారు.

ఈ వర్గ పోరు మధ్య ఐక్యత అన్నది సవాల్ గా మారుతోంది. బండారు పెందుర్తి నుంచి మాడుగుల వెళ్లడం అంటే దిగుమతి సరుకే అని లోకల్ లీడర్స్ అంటున్నారు. ఆయనను అక్కడ పెట్టి వైసీపీకి బలంగా ఉన్న మాడుగుల నుంచి గెలవడం అది కూడా నెల రోజుల వ్యవధిలో అంటే కుదిరే పనేనా అని అంటున్నారు. బండారు బడబాగ్ని చల్లార్చడం ఎలాగో తెలియడం లేదు. మాడుగుల చిక్కుముడులను విప్పడం కూడా కష్టతరమే అవుతోందని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?