బొత్స కేరాఫ్ విశాఖ?

వైసీపీలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇక మీదట విశాఖ నుంచి రాజకీయాలు చేస్తారా అన్న దాని మీద వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది. విజయనగరం జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వస్తున్న…

వైసీపీలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇక మీదట విశాఖ నుంచి రాజకీయాలు చేస్తారా అన్న దాని మీద వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది. విజయనగరం జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వస్తున్న బొత్స ఇపుడు ఉన్నట్టుండి విశాఖ షిఫ్ట్ కాబోతున్నారు అని టాక్ నడుస్తోంది.

బొత్స విశాఖ నుంచి రాజకీయం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అయితే అది వీలు పడలేదు. పైగా ఆయన విజయనగరం బ్రాండ్ అలాగే ఉంది. ఇపుడు ఆయనకు పరిస్థితులు ఒక్కోటిగా అనుకూలిస్తున్నాయి. తన సతీమణి బొత్స ఝాన్సీలక్ష్మిని ఆయన విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా చేసుకోగలిగారు ఇది ఆయన విశాఖ రాజకీయానికి తొలి మెట్టు అని అంటున్నారు.

విశాఖలో తన సతీమణి గెలవాలీ అంటే తాను సీరియస్ గానే పాలిటిక్స్ చేయాలని బొత్స భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాను ఎక్కడో వేరే చోట నుంచి పోటీ చేస్తే విశాఖలో ఎంపీగా తన సతీమణి విజయంలో భాగం కాలేను అని ఆయన అనుకుంటున్నారుట. అందుకే ఝాన్సీ ఎంపీగా పోటీ చేస్తున్న విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో ఏదో ఒక చోట తాను పోటీకి దిగాలని బొత్స కొద్ది కాలంగా సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.

ఈ క్రమంలో ఆయన భీమునిపట్నం సీటు మీద కన్ను వేశారు అని అంటున్నారు. భీమిలీ అయితే విజయనగరంలో కలసి ఉంది. దాంతో పాటుగా బలమైన కాపు సామాజిక వర్గం అక్కడ ఉంది. దాంతో బొత్స భీమిలీ నుంచి పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు.  ఈ విషయం ఆయన హై కమాండ్ చెవిన వేశారు అని అంటున్నారు

భీమిలీలో ప్రస్తుతం మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అభ్యర్ధిగా ఉన్నారు. ఆయనే మరోసారి పోటీ చేస్తారు అని అంటున్నారు. అయితే విశాఖ ఎంపీ గెలవాలి అంటే భీమిలీ నుంచి వచ్చే మెజారిటీ కీలకం. అక్కడ కొత్త ఓటర్లతో కలుపుకుంటే మూడున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు.  ఇక్కడ వైసీపీ మంచి మెజారిటీ తెచ్చుకుంటే ఎంపీ అభ్యర్థికి కలుస్తుందని అంటున్నారు. దాంతో బొత్స భీమిలీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని అంటున్నారు. హై కమాండ్ ఆయన ఆలోచనలకు సరే అంటే బొత్స విశాఖ నుంచే పాలిటిక్స్ స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు.