విశాఖ జిల్లా అత్యంత కీలకం. రాజకీయంగా ప్రభావం చూపించే ఏరియా. అటువంటి విశాఖలో టీడీపీ జనసేన కూటమి రాజకీయం అయోమయంగా సాగుతోంది అని అంటున్నారు. అధికారంలో ఉన్న వైసీపీతో పోటీ పడాల్సిన వేళ ఆ పార్టీ కంటే కూటమి వెనకబడి ఉంది అన్నది ప్రస్తుతం చూస్తే కనిపించే రాజకీయ సన్నివేశం.
వైసీపీ దాదాపుగా విశాఖ జిల్లాలో అభ్యర్ధులను ఖరారు చేసినట్లే. ఒకటి రెండు చోట్ల చివరి నిముషంలో మార్పు చేర్పులు ఉంటే ఉండొచ్చు. కానీ మొత్తానికి చూస్తే వైసీపీ లిస్ట్ క్లారిటీగా ఉంది. అభ్యర్ధులు జనంలోకి పోతున్నారు. అదే టీడీపీ జనసేన కూటమిలో ఎటూ ఏమీ తేల్చడంలేదు అన్న బాధ తమ్ముళ్లలో జనసైనికులలో ఉంది.
గాజువాక అసెంబ్లీ సీటు ఎవరికి ఇస్తారు జనసేనకా టీడీపీగా అన్నది తెలియడం. లేదు, విశాఖ నార్త్ మరీ అయోమయంగా ఉంది. ఈ సీటు కోసం బీజేపీతో సహా మూడు పార్టీలు పట్టుబడుతున్నాయి. పొత్తు ఉంటే తమకే అని కాషాయం పార్టీ అంటోంది.
విశాఖ సౌత్ లో సిగపట్లు కొనసాగుతున్నాయి. ఈ సీటు విషయంలో జనసేనలో ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. టీడీపీలో ఇంచార్జి గండి బాబ్జీ నాన్ లోకల్ అని టీడీపీలో మరి కొంతమంది తమ వంతు ప్రయత్నం మొదలెట్టారు. ఎవరికి సీటు ఇచ్చినా రెబెల్స్ ఖాయం అన్నది ఇక్కడ మాట. భీమునిపట్నం సీటులో అదే డైలామా కొనసాగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సీటు కోరుతున్నారు. జనసేన పట్టుదలగా ఈ సీటు విషయంలో ఉంది.
ఎస్ కోటలో టీడీపీలో రెండు వర్గాల మధ్య పోరుతో సీటు ప్రకటించడం లేదు. విశాఖ ఎంపీ అభ్యర్ధి ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది. టీడీపీ నుంచి బాలయ్య అల్లుడు పోటీకి రెడీ అని చెబుతున్నా బీజేపీతో పొత్తు ఉంటే వారికే సీటు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పార్టీలో ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఇలా విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్ధులు ఎవరూ డిసైడ్ కాక క్లారిటీ లేక మూడు పార్టీలలో అయోమయం అయితే కొనసాగుతోంది.