సంక్షేమ ప‌థ‌కాల ఊసెత్త‌ని బాబు!

ఎన్డీఏ శాస‌న‌స‌భ ప‌క్ష నాయ‌కుడిగా చంద్ర‌బాబునాయుడిని మూడు పార్టీలు క‌లిసి ఎన్నుకున్నాయి. ముఖ్య‌మంత్రిగా 12వ తేదీ చంద్ర‌బాబునాయుడు బాధ్య‌త‌లు తీసుకోనున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు అమ‌రావ‌తిలో అభివృద్ధి ప‌నులు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. జ‌గ‌న్…

ఎన్డీఏ శాస‌న‌స‌భ ప‌క్ష నాయ‌కుడిగా చంద్ర‌బాబునాయుడిని మూడు పార్టీలు క‌లిసి ఎన్నుకున్నాయి. ముఖ్య‌మంత్రిగా 12వ తేదీ చంద్ర‌బాబునాయుడు బాధ్య‌త‌లు తీసుకోనున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు అమ‌రావ‌తిలో అభివృద్ధి ప‌నులు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌రావ‌తిని విస్మ‌రించ‌డంతో, ముళ్ల కంప‌ల‌తో క‌ళావిహీనంగా క‌నిపించింది. కూట‌మి అధికారంలోకి రావ‌డంతో రాజ‌ధాని అమ‌రావ‌తి కొత్త శోభ‌ను సంత‌రించుకుంటోంది.

ఇవాళ్టి ఎన్డీఏ శాస‌న‌స‌భ ప‌క్ష నాయ‌కుడి ఎన్నిక స‌మావేశంలో చంద్ర‌బాబునాయుడు మాట్లాడుతూ ఇక‌పై మ‌న రాజ‌ధాని అమ‌రావ‌తే అని తేల్చి చెప్పారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. రాజ‌ధాని ప్రాంత వాసుల‌కు చంద్ర‌బాబు తీపి క‌బురు అందించారు. ఇదే సంద‌ర్భంలో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై చంద్ర‌బాబు మ‌న‌సులో ఏమున్న‌దో అర్థం కావ‌డం లేదు. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎన్నెన్ని అప్పులు చేసిందో ఎవ‌రికీ తెలియ‌ద‌ని ఆయ‌న అన్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసింద‌నే సాకుతో సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు చంద్ర‌బాబు ఎస‌రు పెడ‌తారా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ స‌ర్కార్ గ‌త ఏళ్ల‌లో ఎంతో నిబ‌ద్ధ‌త‌తో సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేసినా, జ‌నం ఓట్లు వేయ‌క‌పోవ‌డం చంద్ర‌బాబుకు ధైర్యాన్ని ఇస్తోందా? అనే అనుమానం త‌లెత్తుతోంది. చంద్ర‌బాబు సూప‌ర్ సిక్స్ పేరుతో ఏడాదిగా భారీగా సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌చారం చేస్తూ వ‌చ్చారు.

ఆ త‌ర్వాత జ‌న‌సేన‌తో పొత్తు త‌ర్వాత మ‌రికొన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కూట‌మి మేనిఫెస్టో అమ‌లు బాధ్య‌త‌ను చంద్ర‌బాబు, తాను తీసుకుంటామ‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ ప్ర‌క‌టించిన మేనిఫెస్టో అమ‌లు చేయాలంటే ఏడాదికి రూ.1.65 ల‌క్ష‌ల కోట్లు అవ‌స‌ర‌మ‌ని వైఎస్ జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో చెప్పారు. ఎలాగైతేనేం కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది.

అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌య‌మై చంద్ర‌బాబు స్ప‌ష్ట‌త ఇచ్చారు. కానీ సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు గురించి ఊసెత్త‌క‌పోవ‌డంతో జ‌నంలో ఆందోళ‌న‌. గ‌తంలో మాదిరిగానే చంద్ర‌బాబు మాట‌పై నిల‌బ‌డ‌రేమో అనే భ‌యం ఏర్ప‌డింది. ఏమ‌వుతుందో చూడాలి.