కన్నడ సినీ పరిశ్రమలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఓ హత్య కేసులో స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ అయ్యాడు. మృతుడు దర్శన్ వీరాభిమాని. అతడి పేరు రేణుకా స్వామి.
ఇంతకీ ఏం జరిగింది.. ఇదొక లివ్-ఇన్ రిలేషన్ షిప్ క్రైమ్ స్టోరీ. హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ మధ్య ఎఫైర్ ఉందనేది కన్నడనాట బహిరంగ రహస్యం. ఈ ఎఫైర్ వల్లనే తన భార్యకు దర్శన్ దూరంగా ఉంటున్నాడనే ప్రచారం కూడా ఉంది.
అటు పవిత్ర కూడా పలు సందర్భాల్లో దర్శన్ తో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు, తామిద్దరం పదేళ్లుగా సహజీవనం చేస్తున్నామంటూ ఆమె గతంలో వివాదాస్పద ప్రకటన కూడా చేసింది. ఎందుకంటే, దర్శన్ కు ఆల్రెడీ పెళ్లయింది, పిల్లలున్నారు. అటు పవిత్రకు కూడా పెళ్లయింది, ఓ కూతురు ఉంది. కాకపోతే భర్తతో ఆమె విడిపోయింది.
ఓవైపు ఇదిలా సాగుతుండగా, మరోవైపు వీళ్లిద్దరి మధ్యలోకి ఎంటరయ్యాడు రేణుకా స్వామి. 33 ఏళ్ల ఈ వ్యక్తి వీరాభిమానిగా దర్శన్ కు పరిచయమయ్యాడు. దర్శన్ నటించిన ఎన్నో సినిమాలకు ఇతడు చాలా హంగామా చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు.
అసభ్యకర వీడియోలు, సందేశాలు.. ఆ తర్వాత క్రమంగా పవిత్రకు కూడా దగ్గరయ్యాడు. దర్శన్ కు వీరాభిమాని కాబట్టి పవిత్ర కూడా అతడితో సన్నిహితంగా ఉంది. దీన్ని అతడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు. పవిత్రకు కొన్ని అసభ్య సందేశాలు, వాట్సాప్ లో అభ్యంతరకర వీడియోలు పంపించినట్టు తెలుస్తోంది.
విషయం దర్శన్ వరకు వెళ్లింది. అతడు తన వ్యక్తిగత సిబ్బందితో రేణుక స్వామిని తీసుకురావాల్సిందిగా ఆదేశించాడట. ఆ తర్వాతే రేణుకా స్వామి హత్యకు గురయ్యాడు.
ఈ కేసులో దర్శన్ వ్యక్తిగత సిబ్బందితో పాటు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లిచ్చిన సమాచారం ఆధారంగా మైసూర్ లోని ఫామ్ హౌజ్ లో ఉన్న దర్శన్ ను కూడా అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకొచ్చారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది, పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.