Advertisement

Advertisement


Home > Politics - Andhra

సానుభూతి కోసం ముంద‌స్తుకెళ్లి.. బోర్లాప‌డ్డ బాబు!

సానుభూతి కోసం ముంద‌స్తుకెళ్లి.. బోర్లాప‌డ్డ బాబు!

ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ ఏదో ఒక సానుభూతిని సాకుగా తీసుకుని ఎన్నిక‌ల్లో గెలుపొందాల‌ని చంద్ర‌బాబునాయుడు తపిస్తుంటార‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తుంటారు. రాజ‌కీయంగా క‌లిసొచ్చే ఏ ఒక్క చిన్న విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు వ‌దిలి పెట్ట‌రు. ఎందుకంటే చంద్ర‌బాబునాయుడు ప‌క్కా రాజ‌కీయ నాయ‌కుడు. తాజాగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై దాడి నేప‌థ్యంలో సానుభూతి అంశం తెర‌పైకి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబునాయుడు సానుభూతితో ఓట్లు కొల్ల‌గొట్టాల‌ని ఎత్తుగ‌డ వేసి... ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి బొక్క బోర్లాప‌డ్డారు. 2003 నాటి రాజ‌కీయ సానుభూతి వ్య‌వ‌హారం తెర‌పైకి వ‌చ్చింది. చంద్ర‌బాబు చావు అంచుల వ‌ర‌కు వెళ్లినా, జ‌నం మాత్రం ఆయ‌న‌పై సానుభూతి చూప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, వ‌రుస‌గా ప‌దేళ్ల పాటు ఆయ‌న్ను అధికారానికి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు దూరంగా పెట్టారంటే, ఎంత దుర్మార్గంగా ప‌రిపాలించి వుంటారో అర్థం చేసుకోవ‌చ్చు.

1995లో  ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వి నుంచి కూల‌దోసి చంద్ర‌బాబునాయుడు అధికారంలోకి వ‌చ్చారు. అలా నాలుగేళ్ల పాటు అధికారం చెలాయించారు. 1999లో వాజ్‌పేయ్ పుణ్య‌మా అని మ‌ళ్లీ చంద్ర‌బాబు అధికారాన్ని నిల‌బెట్టుకున్నారు. ఇదే సంద‌ర్భంలో కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా క‌లిసొచ్చాయి.

2004లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి వుండింది. అప్ప‌టికే చంద్ర‌బాబు పాల‌న‌పై జ‌నం విసిగిపోయి ఉన్నారు. బ‌షీర్‌బాగ్ కాల్పుల్లో ఇద్ద‌ర్ని చంద్ర‌బాబు స‌ర్కార్ పొట్ట‌న పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో 2003, అక్టోబ‌ర్ 1న చంద్ర‌బాబునాయుడు తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామి వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించేందుకు బ‌య‌ల్దేరారు. తిరుప‌తిలో అలిపిరి టోల్‌గేట్‌కు స‌మీపంలో మావోయిస్టులు పేల్చిన మందుపాత‌ర్ల ధాటికి చంద్ర‌బాబు ప్ర‌యాణిస్తున్న బుల్లెట్ ప్రూప్ కారు ఎగిరి ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో చంద్ర‌బాబు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఆ ఘ‌ట‌న‌లో బాబుకు పున‌ర్జ‌న్మ ల‌భించింద‌ని చెప్పొచ్చు.

అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు ప‌రామ‌ర్శ పేరుతో ఒక పెద్ద డ్రామా న‌డిచింది. ప్ర‌తి రోజూ ఆయ‌న ఇంటి వ‌ద్ద వివిధ ప్రాంతాల నుంచే వ‌చ్చే విద్యార్థులు, ప్ర‌జాసంఘాలు, రాజ‌కీయ పార్టీల నేత‌ల హడావుడి అంతాఇంతా కాదు. ఇది రోజుల త‌ర‌బ‌డిసాగింది. ఈ త‌తంగం వెనుక బాబు వ్యూహాన్ని ఎవ‌రూ ప‌సిగ‌ట్ట‌లేక‌పోయారు. నాడు ప‌రామ‌ర్శ‌ల‌కు రామోజీరావు ప‌త్రిక విప‌రీతంగా ప్రాధాన్యం ఇవ్వ‌డం వెనుక రాజ‌కీయ ఉద్దేశం అంతుచిక్క‌లేదు.

ఇదంతా సానుభూతి పొందేందుకు సాగించిన ఎపిసోడ్ అని ఆల‌స్యంగా తెలిసింది. 2003, న‌వంబ‌ర్‌లో అసెంబ్లీని చంద్ర‌బాబునాయుడు ర‌ద్దు చేసి, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు. అప్ప‌టికే త‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వుంద‌ని గ్ర‌హించిన చంద్ర‌బాబు, అలిపిరి ఎపిసోడ్‌లో సానుభూతి వెల్లువెత్తుతుంద‌ని న‌మ్మారు. అసెంబ్లీని ర‌ద్దు చేసిన నెల లేదా రెండు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని చంద్ర‌బాబు అంచ‌నా వేశారు.

కానీ చంద్ర‌బాబు ఊహించిన‌ట్టు జ‌ర‌గ‌లేదు. 2004, మే నెల‌లో ఎన్నిక‌లు జ‌రిగాయి. మండుటెండ‌లో నాటి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర చేశారు. జ‌నం ఆయ‌న‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కొన్ని పార్టీల‌తో పొత్తు పెట్టుకుని ఘ‌న విజయం సాధించింది. ముఖ్య‌మంత్రిగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆ త‌ర్వాత 2009లో కూడా వ‌రుస‌గా రెండో సారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. అంటే ప‌దేళ్ల పాటు చంద్ర‌బాబును అధికారానికి దూరం చేసేంత‌గా ప్ర‌జ‌లు బుద్ధి చెప్పారు. 

వైఎస్సార్ మ‌ర‌ణంతో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎవ‌రూ ఊహించ‌ని రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌కు దారి తీసింది. ఒక్క‌టి మాత్రం నిజం... బాబు చావు వ‌ర‌కూ వెళ్లి వ‌చ్చినా ప్ర‌జ‌లు మాత్రం సానుభూతి చూప‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?