Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్‌కు త్వ‌ర‌గా ప‌ని పెట్టిన బాబు

జ‌గ‌న్‌కు త్వ‌ర‌గా ప‌ని పెట్టిన బాబు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చాలా త్వ‌ర‌గా ప‌ని పెట్టారు. నిజానికి ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ తీవ్ర నైరాశ్యానికి లోన‌య్యారు. త‌న పార్టీ నాయ‌కుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో కొత్త ప్ర‌భుత్వానికి ఆరు నెల‌ల నుంచి ఏడాది స‌మ‌యం ఇద్దామ‌ని చెప్పారు. హామీల‌ను అమ‌లు చేయ‌డానికి స‌మ‌యం తీసుకుందామ‌న్నారు.

ఆ ఆలోచ‌న‌ల‌తోనే వైసీపీ నేత‌లు రిలాక్ష్ మూడ్‌లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ పులివెందుల‌కు వెళ్లి మూడు రోజుల పాటు త‌న పార్టీ కేడ‌ర్‌తో మ‌మేకం అయ్యారు. ఆ త‌ర్వాత బెంగ‌ళూరుకు వెళ్లి ఐదు రోజులు గ‌డిపారు. కానీ టీడీపీ నేత‌లు మాత్రం దారుణంగా ఓడిపోయిన వైసీపీని మ‌రింత‌గా ఇబ్బందుల్లోకి నెట్టేందుకు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇక న‌ష్ట‌పోవ‌డానికి వైసీపీ వ‌ద్ద ఏమీ లేద‌ని టీడీపీకి అర్థం కాలేదు.

అప‌రిమిత‌మైన అధికారం ద‌క్క‌డంతో టీడీపీకి దిక్కు తోచ‌డం లేదు. ఏదో ఒక‌టి చేయ‌నిదే, అధికారం వ‌చ్చింద‌ని జ‌నానికి తెలియ‌ద‌ని అనుకున్న‌ట్టుంది. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు, నాయ‌కులే బుల్డోజ‌ర్ల‌తో వైసీపీ నేత‌ల భ‌వ‌నాల‌పైకి దండెత్తారు. అలాగే కొంద‌రు ముఖ్య నేత‌ల‌పై కేసులు పెట్టి జైలుకు పంపారు. టీడీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల దాడులు, దౌర్జ‌న్యాలు శ్రుతిమించాయ‌నే అభిప్రాయం ప్ర‌జానీకంలో ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో నెల్లూరు సెంట్ర‌ల్ జైల్లో ఉన్న‌ వైసీపీ ముఖ్య నాయ‌కుడు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని ప‌రామ‌ర్శించేందుకు వైఎస్ జ‌గ‌న్ వెళ్లారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇప్ప‌టికైనా టీడీపీ దౌర్జ‌న్యాలు ఆప‌క‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా వుంటాయ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వం శాశ్వ‌తం కాద‌ని, ఎల్ల‌కాలం రోజులు మీ వైపే వుండ‌ద‌ని ఆయ‌న ఘాటు హెచ్చ‌రిక చేశారు. జ‌గ‌న్ వార్నింగ్ వైసీపీలో నూత‌నోత్సాహాన్ని నింపింది. అలాగే టీడీపీలో త‌ప్ప‌కుండా వ‌ణుకు పుట్టించేలా వుంది.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న ప‌ని తాను చేసుకెళుతుంటే ఇంత త్వ‌ర‌గా జ‌గ‌న్ బ‌య‌టికి వ‌చ్చి వుండేవారు కాదు. చంద్ర‌బాబు నీతులు ఎన్ని మాట్లాడుతున్నా, ఆచ‌ర‌ణ మ‌రోలా వుంది. వైసీపీకి పాజిటివ్ క‌లిగించే అంశాల్ని చేజేతులా కూట‌మి ప్ర‌భుత్వం సృష్టిస్తోంది.

 


  • Advertisement
    
  • Advertisement