టీడీపీలోకి వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు!

త్వ‌ర‌లో ప‌ద‌వీ కాలం ముగియ‌నున్న వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి త్వ‌ర‌లో టీడీపీలో చేర‌నున్నారు. నెల్లూరు సిటీ టికెట్ విష‌య‌మై వైసీపీ అధిష్టానంతో వేమిరెడ్డికి విభేదాలు త‌లెత్తాయి. వైసీపీలో సౌమ్యుడిగా, అజాత శ‌త్రువుగా…

త్వ‌ర‌లో ప‌ద‌వీ కాలం ముగియ‌నున్న వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి త్వ‌ర‌లో టీడీపీలో చేర‌నున్నారు. నెల్లూరు సిటీ టికెట్ విష‌య‌మై వైసీపీ అధిష్టానంతో వేమిరెడ్డికి విభేదాలు త‌లెత్తాయి. వైసీపీలో సౌమ్యుడిగా, అజాత శ‌త్రువుగా గుర్తింపు పొందిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి పార్టీకి దూర‌మ‌వుతార‌నే చేదు వార్త‌ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు వైసీపీ ఆయ‌న పార్టీ మార‌డాన్ని త‌ట్టుకోలేక‌పోతోంది.

వేమిరెడ్డి లాంటి నాయ‌కుడిని కూడా పోగొట్టుకుంటే ఎలా అని సీఎం జ‌గ‌న్‌పై సొంత పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత న‌ర‌సారావుపేట ఎంపీ అభ్య‌ర్థి అనిల్‌కుమార్ యాద‌వ్ నోటి దురుసు అంద‌రికీ తెలుస‌ని, అలాంటి నాయ‌కుడి కోసం వేమిరెడ్డి లాంటి ఆర్థికంగా బ‌ల‌వంతుడైన నేత‌ను పోగొట్టుకోవ‌డం ఏంటో అర్థం కావ‌డం లేద‌ని వైసీపీ నేత‌లు వాపోతున్నారు.

వైసీపీపై అల‌క‌బూనిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డితో చంద్ర‌బాబునాయుడు ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు తెలిసింది. మీలాంటి మంచి మ‌నిషి త‌మ పార్టీలోకి వ‌స్తే చాలా ఆనందిస్తామ‌ని, నెల్లూరు ఎంపీగా పోటీ చేయాల‌ని ఆహ్వానించిన‌ట్టు స‌మాచారం. నిజానికి రాజ‌కీయాల‌కు దూరంగా వుండాల‌ని వేమిరెడ్డి నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ, అనిల్‌కుమార్ యాద‌వ్ రెచ్చ‌గొడుతుండ‌డంతో మ‌న‌సు మార్చుకున్నార‌ని స‌మాచారం.

టీడీపీలో చేరి, ఎంపీగా పోటీ చేసి అనిల్‌తో పాటు అత‌నికి వ‌త్తాసు ప‌లుకుతున్న సీఎం జ‌గ‌న్‌కు బుద్ధి చెప్పాల‌నే ప‌ట్టుద‌ల‌తో వేమిరెడ్డి టీడీపీలో చేర‌డానికి సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లో టీడీపీ కండువా క‌ప్పుకోనున్నారు. వేమిరెడ్డి టీడీపీలో చేర‌డం , నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి ఎంతో బ‌లం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే సంద‌ర్భంలో వైసీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం దెబ్బ‌తింటుంది. టీడీపీలో వేమిరెడ్డి చేరితే, నెల్లూరు జిల్లాకు చెందిన మ‌రికొంద‌రు కీల‌క నేత‌లు ఆయ‌న బాట‌లో న‌డ‌వొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.