విశాఖ మీద సీఎం రమేష్ మోజు?

విశాఖ ఎంపీ సీటు నుంచి బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పోటీ చేస్తారు అని వార్తలు తరచూ వస్తున్నాయి. ఆయన కడప జిల్లాకు చెందిన వారు. విశాఖ ఎక్కడ కడప ఎక్కడ అన్నది కూడా…

విశాఖ ఎంపీ సీటు నుంచి బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పోటీ చేస్తారు అని వార్తలు తరచూ వస్తున్నాయి. ఆయన కడప జిల్లాకు చెందిన వారు. విశాఖ ఎక్కడ కడప ఎక్కడ అన్నది కూడా రాజకీయ వర్గాలలో ఉంది.
 
అయితే విశాఖ ఎక్కడ నుంచి వచ్చిన వారిని అయినా ఆదరిస్తుంది అని చరిత్ర నిరూపించింది. నెల్లూరు నుంచి వచ్చిన టి సుబ్బరామిరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డిలను అలాగే ఒంగోలు నుంచి వచ్చిన దగ్గుబాటి పురంధేశ్వరిని విశాఖ ఎంపీలుగా గెలిపించింది. దాంతో విశాఖ నుంచి పోటీకి ఆయన చూస్తున్నారు అని అంటున్నారు.

ఉత్తరాంధ్రాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ తనకు అన్ని రకాలైన సామాజిక రాజకీయ సమీకరణలు కలిసి వస్తాయని భావిస్తున్నారుట. విశాఖకు కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ నెల 27న వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతూ విశాఖలో వెలసిన ఫ్లెక్సీలలో సీఎం రమేష్ పేరు కూడా ఉంది. ఆయన పేరుతో ఫ్లెక్సీలు పెట్టడంతో రమేష్ కి విశాఖ ఎంపీ సీటు మీద మోజు ఉందని అంటున్నారు.

బీజేపీ అధినాయకత్వం సరేనంటే ఆయన విశాఖ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి సన్నిహితుడుగా పేరు మోసిన రమేష్ కి పొత్తులో భాగంగా ఎంపీ టికెట్ కేటాయించడానికి సుముఖంగానే ఉంటారు అని అంటున్నారు.

విశాఖ నుంచి ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేయడానికి కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి కూడా ట్రై చేస్తున్నారు. విశాఖలో ఇప్పటికే నివాసం ఏర్పాటు చేసుకున్న రాజ్య సభ సభ్యుడు జీవీల్ నరసింహారావు కూడా రేసులో ఉన్నారు. బీజేపీ హై కమాండ్ దయతో పాటు టీడీపీ దయ కూడా ఉంటేనే విశాఖ ఎంపీ సీటు దక్కుతుందని అంటున్నారు.