Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌గ‌న్‌కు పులివెందుల హెచ్చ‌రిక‌!

జ‌గ‌న్‌కు పులివెందుల హెచ్చ‌రిక‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ఇవి డేంజ‌ర్ సిగ్న‌ల్స్‌. తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పులివెందుల గ‌డ్డ మీద నిర‌స‌న గ‌ళాలు వినిపించాయి. పార్టీ, ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రాన్ని ఈ నిర‌స‌న స్వ‌రాలు గుర్తు చేస్తున్నాయి. పులివెందుల ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌య స‌మీపంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ప్లీన‌రీ స‌మావేశం జ‌రిగింది.

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, క‌డ‌ప మేయ‌ర్‌, వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు సురేష్‌బాబు స‌మ‌క్షంలో నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య నాయ‌కులు నిర్మొహ‌మాటంగా ప్ర‌జ‌ల్లోనూ, పార్టీ కార్య‌క‌ర్త‌ల్లోనూ గూడుక‌ట్టుకున్న అసంతృప్తిని బ‌య‌ట పెట్టారు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకునేందుకు రెండు మెతుకులు ప‌ట్టుకుంటే చాల‌నే చందంగా... సీఎం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితిని అర్థం చేసుకోడానికి గ్రామ‌నాయ‌కుల నిర‌స‌న స్వ‌రాలు ప‌నికొస్తాయి.

ఏపీఐఐసీ డైరెక్ట‌ర్ చంద్ర ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర‌మంతా కార్య‌క‌ర్త‌లు అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌ని పులివెందుల గ‌డ్డ మీద నుంచి క‌ఠిన‌, చేదు వాస్త‌వాన్ని నిర్భ‌యంగా బ‌య‌ట పెట్టారు. కార్య‌క‌ర్త‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం గుర్తించాల‌ని డిమాండ్ చేశారు. ఈ విష‌యాల‌ను ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్లాల‌ని ఆయ‌న కోర‌డం గ‌మ‌నార్హం. వేముల మాజీ వైస్ ఎంపీపీ రామ‌లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉత్స‌వ విగ్ర‌హాల్లా మారార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తి విష‌యంలోనూ వాలంటీర్ల‌దే పెత్త‌నం అన్నారు. కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర అసంతృప్తి వుంద‌న్నారు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రైతుల‌కు డ్రిప్ ప‌రిక‌రాలు అంద‌క‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నార‌ని స‌భ దృష్టికి తీసుకెళ్లారు. మ‌రో వైసీపీ నాయ‌కుడు బ‌ల‌రాంరెడ్డి మాట్లాడుతూ స‌బ్సిడీపై బిందు, తుంప‌ర్ల సేద్యం ప‌రిక‌రాలిచ్చి రైతుల్లో అసంతృప్తిని పోగొట్టాలని కోరారు.  

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో నాయ‌కుల మ‌న‌సులో మాట‌లివి. ఇలా ఎవ‌ర్ని క‌దిలించినా ఇదే ఆవేద‌న‌, ఆక్రోశం. పులివెందుల హార్టిక‌ల్చ‌ర్ పంట‌ల‌కు ప్ర‌సిద్ధి. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత స‌బ్సిడీపై డ్రిప్‌, తుంప‌ర్ల సేద్య ప‌రిక‌రాల‌ను ఇచ్చే ప‌థ‌కాన్ని పూర్తిగా ఎత్తేశారు. రైతుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను దృష్టిలో పెట్టుకుని మ‌ళ్లీ పున‌రుద్ధరించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని అంటున్నారు.

గ్రామాల్లో వ‌లంటీర్ల‌దే పూర్తిగా పెత్త‌నం కావ‌డంతో ఇక త‌మ ద‌గ్గ‌రికి ప్ర‌జ‌లు ఎందుకు వ‌స్తార‌నే ఆవేద‌న గ్రామ నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. ల‌క్ష‌లు, కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టుకుని స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా గెలిచినా ప్ర‌యోజ‌నం ఏంట‌నేది గ్రామ నాయ‌కుల ప్ర‌శ్న‌. ముఖ్యంగా జ‌గ‌న్ అధికారంలోకి వచ్చిన త‌ర్వాత గ్రామాల్లో పార్టీ నాయ‌క‌త్వం పూర్తిగా డ‌మ్మీగా మారిపోయింద‌నేది వారి ఆవేద‌న‌. మ‌రోవైపు జ‌గ‌న్ మాత్రం ఈ ద‌ఫా 175కి 175 సీట్లు గెల‌వాల్సిందేన‌ని దిశానిర్దేశం చేశారు. మ‌రోవైపు వైసీపీ కార్య‌క‌ర్తలు, రైతుల్లో అసంతృప్తి వుంద‌ని ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ప్లీన‌రీ స‌మావేశంలో పార్టీ నాయ‌కులే కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్ప‌డం విశేషం.

చంద్ర ఓబుల్‌రెడ్డి, రామ‌లింగారెడ్డి, బ‌ల‌రాంరెడ్డి త‌దిత‌రులు జ‌గ‌న్‌పై, అలాగే వైసీపీపై అభిమానంతో మాట్టాడారు. ఒక్క పులివెందుల నియోజ‌క‌వ‌ర్గమే కాదు, రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల ఆలోచ‌న‌లు, అసంతృప్తిని వీరి మాట‌లు ప్ర‌తిబింబించాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, అలాగే సామాన్య‌ ప్ర‌జ‌ల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంద‌నే ఆవేద‌న‌తో నిజాలు వెళ్ల‌గ‌క్కారు. 

ఇక రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో, మ‌రోసారి అధికారంలోకి రావాలంటే న‌ష్ట నివార‌ణ చేప‌ట్టాల‌నే కోరిక‌, ఆరాటం వారి మాట‌ల్లో క‌నిపించింది.  గ్రామ‌నాయ‌కులు చెప్పారు క‌దా అని లైట్‌గా తీసుకుంటే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని గుర్తించాల్సి వుంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీ కార్య‌క‌ర్త‌లు, రైతుల్లోని అసంతృప్తిని ఏ విధంగా పోగొడ‌తారో మ‌రి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?