Advertisement

Advertisement


Home > Politics - Andhra

జ‌న‌సేన‌లోకి మాజీ మంత్రి?

జ‌న‌సేన‌లోకి మాజీ మంత్రి?

మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి జ‌న‌సేన‌లోకి వెళ్ల‌నున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఆయ‌న విమ‌ర్శించ‌డం చూస్తే... జ‌న‌సేన‌లో చేరిక‌పై అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి. రానున్న ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని డీఎల్ ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రాధాన్యం ఏర్ప‌డింది.

పేద ప్ర‌జ‌ల కోసం పోరాటం చేసేందుకు ప్ర‌ముఖ రాజ‌కీయ పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని డీఎల్ ప్ర‌క‌టించ‌డంతో క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కూడా ఆయ‌న విమ‌ర్శించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఏ పార్టీ త‌ర‌పున పోటీ చేస్తాన‌నేది ఆయ‌న స్ప‌ష్టంగా ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి డీఎల్ జ‌న‌సేన‌లోకి వెళ్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

నిజానికి ఆయ‌న టీడీపీ త‌ర‌పున పోటీ చేయాల‌ని కోరుకుంటున్నారు. అయితే టీటీడీ మాజీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ రూపంలో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కుడున్నారు. గ‌తంలో రెండుసార్లు ఆయ‌న టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. గ‌తంలో పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు డీఎల్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, ఆయ‌న గెలుపొంద‌లేదు. టీడీపీలో పుట్టా, డీఎల్ మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రిగింది. 2019 ఎన్నిక‌ల్లో డీఎల్ వైసీపీకి మ‌ద్ద‌తు ఇచ్చారు.

ఆ త‌ర్వాత కాలంలో వైసీపీని విభేదిస్తున్నారు. మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లిజ సామాజిక వ‌ర్గం కీల‌క పాత్ర పోషిస్తోంది. దీంతో జ‌న‌సేన‌లో చేరితే, వైసీపీ, టీడీపీ అసంతృప్త‌వాదులు త‌న‌కు మ‌ద్ద‌తు ఇస్తార‌నేది ఆయ‌న అంచ‌నా. జ‌న‌సేన‌లో చేర‌డం ద్వారా బ‌లిజ‌ల ఓట్ల‌ను రాబ‌ట్టుకోవ‌చ్చ‌ని ఆయ‌న అనుకుంటున్నారు. 

జ‌న‌సేన కాక‌పోతే ఆయ‌న‌కు మిగిలిన ఆప్ష‌న్ బీజేపీ మాత్ర‌మే. బీజేపీ, జ‌న‌సేన కూట‌మిలో భాగంగా ఏదో ఒక పార్టీ త‌ర‌పున పోటీ చేయాల‌నే ఆలోచ‌న‌లో మాత్రం డీఎల్ ఉన్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?