Advertisement

Advertisement


Home > Politics - Andhra

స్టీల్ ప్లాంట్ కాదు...బాబే ముఖ్యం

స్టీల్ ప్లాంట్ కాదు...బాబే ముఖ్యం

విశాఖకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తెలుగుదేశంలో ఫుల్ యాక్టివ్ అయిపోయారు. పార్టీ కోసం నాలుగేళ్ళుగా కష్టపడుతున్న వారంతా సైడ్ అయిపోయారు. కష్టకాలంలో బాబుకు గంటా బాగా అక్కరకు వస్తున్నారు. ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా రంగంలోకి దిగి గట్టి వ్యూహాలు పన్ని ఎలాగైతేనేమి టీడీపీ అభ్యర్ధిని గెలిపించారు.

ఆ క్రెడిట్ అలా ఆయన ఖాతాలో అలవోకగా పడిపోయింది. అది అలా ఉండగానే ఇపుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. బలం తక్కువగా ఉన్నా చంద్రబాబు తన పార్టీ నుంచి అభ్యర్ధిని నిలబెట్టారు. నలుగురు ఎమ్మెల్యేలు ఏనాడో గడప దాటి వెళ్లిపోయారు. కచ్చితంగా చూస్తే తెలుగుదేశం వద్ద ఉన్న ఓట్లు 19 మాత్రమే. ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేల మీద ఆశ ఎటూ ఉంది.

ఉన్న పందొమ్మిదిలో ఆ మధ్య దాకా గంటా ఓటు డోలాయమానంలో ఉందని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. గంటా టీడీపీలో ఉంటారో లేదా అన్న సందేహాలు కూడా ఒకానొక టైం లో వచ్చాయి. ఇప్పటికి రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుందని ఆగ్రహించి గంటా రాజీనామా అస్త్రం సంధించారు. తన రాజీనామాను ఆమోదించుకోవడానికి ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి స్వయంగా వెళ్ళి కలసి వచ్చారు.

తాను రాజీనామా చేశాను కాబట్టి అసెంబ్లీకి దూరం అన్నట్లుగా ఆయన సమావేశాలకు వెళ్లేవారు కాదు. ఇపుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. గంటా ఓటు టీడీపీకి ప్రత్యేకించి చంద్రబాబు వ్యూహానికి ప్రాణప్రదం అయింది. అందుకే గంటా తన రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదని, తాను ఎమ్మెల్యేనే అని మీడియాకు క్లారిటీ ఇస్తున్నారు.

అంటే ఆనాడు స్టీల్ ప్లాంట్ ఏమైపోతుందో అని రాజీనామా చేసిన గంటా ఇపుడు ఎమ్మెల్యే సీటు పోనందుకు హ్యాపీగా ఉన్నారన్నమాట. ఎన్నికలు ఏడాదిలో ఉన్న వేళ టీడీపీలో పూర్వ వైభవం సంపాదించేందుకు, ఎమ్మెల్యే కోటాలో తన ఓటు అధినాయకత్వానికి తన ఓటు తులసీదళదళంగా ఉపయోగపడడం కంటే కావాల్సింది ఏముందని గంటా వారు భావిస్తున్నారేమో అంటున్నారు. 

స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా కూడా రాజకీయం అనే వైసీపీ అప్పట్లో విమర్శలు చేసింది. ఇపుడు అదే నిజమవుతోందని ఆ పార్టీ సెటైర్లు వేస్తోంది. రాజకీయ నాయకులు ఏమి చేసినా అది స్వధర్మం చూసుకునే సాగుతుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. గంటా వారి ఉదంతం కూడా అదే అని ఉక్కు కార్మికులు భావిస్తే అందులో అపరాధం అయితే లేదనే అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?