అయ్యో గంటా.. మ‌రి ఇప్పుడెట్టా?

మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు పోటీ చేసేందుకు ఒక నియోజ‌క‌వ‌ర్గ‌మంటూ లేకుండా పోయింది. టికెట్ ఇవ్వ‌లేమ‌ని చెప్ప‌లేక‌, ఏదో ఒకటి ఓడిపోయేందుకు అన్న‌ట్టుగా గంటా శ్రీ‌నివాస్ విష‌యంలో టీడీపీ అనుస‌రిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ…

మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు పోటీ చేసేందుకు ఒక నియోజ‌క‌వ‌ర్గ‌మంటూ లేకుండా పోయింది. టికెట్ ఇవ్వ‌లేమ‌ని చెప్ప‌లేక‌, ఏదో ఒకటి ఓడిపోయేందుకు అన్న‌ట్టుగా గంటా శ్రీ‌నివాస్ విష‌యంలో టీడీపీ అనుస‌రిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ నార్త్ నుంచి టీడీపీ త‌ర‌పున ఆయ‌న ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌డంతో గంటా మౌనాన్ని ఆశ్ర‌యించారు.

ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌ళ్లీ ఆయ‌న‌కు టీడీపీ గుర్తుకొచ్చింది. నాయ‌కుల అవ‌స‌రం కావ‌డంతో గంటాను చేర‌దీసిన‌ట్టు టీడీపీ కూడా న‌టించింది. విశాఖ ఉక్కు కోసం ఆయ‌న ఎప్పుడో చేసిన రాజీనామాను ఇటీవ‌ల ఆమోదించి గంటాకు స్పీక‌ర్ షాక్ ఇచ్చారు. గంటా దృష్టి అంతా ఇప్పుడు టికెట్‌పైనే. ఆయ‌న‌కేమో మ‌ళ్లీ విశాఖ నుంచి పోటీ చేయాల‌నేదే ఆశ‌యం.

అయితే టీడీపీ అధిష్టానం మ‌న‌సులో మ‌రో ఆలోచ‌న వుంది. విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లిలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై పోటీ చేయాల‌ని టీడీపీ అధిష్టానం సూచించింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు. త‌న‌కేమో విశాఖ‌లో పోటీ చేయాల‌నే ఆలోచ‌న ఉన్న‌ప్ప‌టికీ, పార్టీ మాత్రం చీపురుప‌ల్లి వెళ్లాల‌ని చెప్పింద‌న్నారు. సీనియ‌ర్ నేత అయిన బొత్స‌పై పోటీ చేయాల‌నే టీడీపీ అధిష్టానం ఆదేశాల‌పై ఆలోచిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

జిల్లానే మారాల్సి వుంటుంద‌ని, త‌న‌కు 150 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. చీపురుప‌ల్లిలో పోటీపై శ్రేయోభిలాషులు, స‌న్నిహితుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని గంటా వెల్ల‌డించారు. వారంలో టీడీపీ సీట్ల‌ను ప్ర‌క‌టిస్తుంద‌ని గంటా తెలిపారు. టికెట్లు ద‌క్క‌ని నేత‌లు పార్టీలు మార‌డం స‌హ‌జ‌మే అని ఆయ‌న అన్నారు.

గంటా అవ‌కాశ వాద రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుండ‌డంతోనే టీడీపీ అధిష్టానం కూడా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పార్టీ క‌ష్ట‌కాలంలో వున్న‌ప్పుడు గంటా అటు వైపు తొంగి చూడ‌లేద‌నే ఆగ్ర‌హం టీడీపీ నేత‌ల్లో వుంది. అందుకే టికెట్‌పై టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. సుదూరంలో ఉన్న చీపురుప‌ల్లికి వెళ్లాల‌ని చెప్ప‌డం, అది కూడా గెలవ‌లేని సీటు కేటాయిస్తామ‌ని చెప్ప‌డంతో గంటా ఖంగుతిన్నారు. ఈ ప‌రిస్థితుల్లో భ‌విష్య‌త్ ఏంటో ఆయ‌న‌కు అర్థం కాని ప‌రిస్థితి. మ‌రోవైపు జ‌న‌సేన‌లో కూడా ఆయ‌నకు చోటు లేద‌ని చెబుతున్నారు.