ఈ రోజుల్లో రాజకీయ నాయకులు లేదా రాజకీయ కుటుంబాల్లోనివారు సీరియస్ కామెంట్స్ చేసినా, సరదాగా మాట్లాడినా దుమారం రేగుతోంది. మాట్లాడే ప్రతి మాటకు రాజకీయ రంగు పులుముతుంటారు. అందులోనూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు, ఏపీలో పార్లమెంటు అండ్ అసెంబ్లీ ఎన్నిలకు జరగబోతున్నాయి.
కాబట్టి రాజకీయ నాయకులే కాదు, వారి కుటుంబాల్లోని వారైనా చాలా సీరియస్ గా మాట్లాడాలి. సరదాగా మాట్లాడినా రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు. నేను సరదాగా అన్నాను అంటే లాభం లేదు. రాజకీయాల్లో ఖాన్ దాదాతో ఆటలాడకూడదు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో తాను పోటీ చేస్తానంటూ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్న మాటలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఆమె తాను సరదాగా అన్నానని చెబుతోంది.
కానీ వైసీపీ నాయకులు ఆమె మాటలను సీరియస్ గానే పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కుప్పంలో 35 ఏళ్లుగా మావారిని గెలిపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నేను నిల్చుంటాను గెలిపిస్తారా అంటూ నారా భువనేశ్వరి చేసిన సరదా వ్యాఖ్యలు చేసింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని నాలుగేళ్లుగా సవాల్ చేస్తూ వస్తున్న వైసీపీ ప్రచారానికి ఈ కామెంట్స్ టానిక్‌లా ఉపయోగపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ లీడర్లు టీడీపీ అధినేతపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఓటమి భయంతోనే చంద్రబాబు కుప్పంలో పోటీ చేయకుండా ఆయన భార్యను పోటీకి నిలుపుతున్నారంటూ ఫైర్ బ్రాండ్ రోజా విమర్శించారు. చంద్రబాబు కుప్పంలో కూడా గెలవలేమని అర్థమైందంటూ చురకలు అంటించారు. ఆమె బరిలో దిగినా గెలవరంటూ మరో మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
ప్రజాజీవితంలో ఉన్న వారు సరదాగా మాట్లాడినా ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. వారు ఏ ఉద్దేశంతో అన్నారో ప్రత్యర్థులకు అనవసరం… వాటిని తమకు నచ్చినట్లు అన్వయించుకుని లబ్ధిపొందేందుకు యత్నిస్తుంటారు. నారా భువనేశ్వరికి కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
“చంద్రబాబుకు విశ్రాంతి తీసుకునే వయసొచ్చింది… కుప్పంలో పోటీ చేయాలని నాకు ఆసక్తిగా ఉంది అని నారా భువనేశ్వరి మనసులో మాట చెప్పడం చూసిన తర్వాత తన పనైపోయిందని చంద్రబాబుకు అర్థమై ఉంటుందని” రోజా అన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారని ఆమె విమర్శించారు.
భువనేశ్వరి వ్యాఖ్యలపై మరో మంత్రి అంబటి రాంబాబు సైతం విమర్శలు గుప్పించారు. కుప్పంలో భువనేశ్వరి పోటీ చేసినా ఓటమి తప్పదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ, కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేక పోయారన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కుప్పం ప్రజలకు మంచినీళ్లు ఇస్తోందని చెప్పారు.
నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. రోజా, అంబటి వ్యాఖ్యలపై అటు తెలుగుదేశం నేతలూ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలను చూసి భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలపైనా రోజా, అంబటి రాంబాబు మాట్లాడటం ఆమె దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
నగరిలో సీటు దక్కదన్న ఆందోళనలో ఉన్న మంత్రి రోజా… జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదని…అందుకే భువనేశ్వరి వ్యాఖ్యలపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక రాంబాబు సీటు జగన్ ఎప్పుడో చింపేశారని ఆ విషయం ఆయనకే అర్థంకావడం లేదన్నారు. సరే… విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా టీడీపీకి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. కాబట్టి రాజకీయాల్లో సరదాలు, జోకులు పనికిరావని దీన్నిబట్టి అర్ధమవుతోంది.