జనసేనాని పవన్‌కల్యాణ్ చేస్తున్న కొన్ని కామెంట్స్‌పై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబును, టీడీపీని చులకన చేసేలా ఆయన కామెంట్స్ ఉన్నాయనే ఆవేదన ఆ పార్టీ నేతల్లో వుంది. టీడీపీ చాలా బలహీనంగా వుందని, తమతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆ పార్టీ నిలబడగలిగిందనే పవన్కామెంట్స్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులకు రుచించడం లేదు.
పట్టుమని ఒక ఎమ్మెల్యే కూడా వెంటలేని విషయాన్ని పవన్‌కు గుర్తు లేనట్టుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే, కనీసం తానే గెలవలేననే భయంతోనే తమతో పొత్తు పెట్టుకుని, ఇప్పుడు భారీ డైలాగ్‌లు చెప్పడం సబబుగా లేదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ వల్ల జనసేన రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నదే తప్ప, ఆ పార్టీతో తమకు కొత్తగా ఒరిగిందేమీ లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
అలాగే బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబునాయుడు వెంపర్లాడుతున్నారనే అర్థం వచ్చేలా పవన్ మాట్లాడ్డం బాగా లేదని టీడీపీ నేతలు అంటున్నారు. బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చేందుకు తానెంతో నలిగిపోయానని, అంతేకాకుండా, చీవాట్లు తిన్నట్టు చెప్పడం ముమ్మాటికీ తమను అవమానించడమే అని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు కుదిర్చేందుకు ఆ పార్టీ అగ్రనేతలకు దండం పెట్టి బతిమలాడినట్టు పవన్ చెప్పడం ఏపీ ప్రజానీకాన్నే అవమానించడంగా ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
పొత్తు అనేది అన్ని పార్టీల రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి వుంటుందే తప్ప, ఎవరూ ఎవర్నీ ప్రాధేయ పడాల్సిన అవసరం వుండదనే కనీస స్పృహ పవన్‌కు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు లేకుంటే పొత్తు కోసం ఎందుకు ముందుకొస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. పవన్ చెబితే వినే పరిస్థితిలో బీజేపీ నేతలున్నారా? అని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.
అయినా తమ పార్టీ ఏమంత అంటరానిదేమీ కాదని, పొత్తు కుదుర్చుకోడానికి బీజేపీ పెద్దలతో చీవాట్లు తినేంత దుస్థితి ఎందుకొచ్చిందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని, చంద్రబాబు, అలాగే తమ పార్టీ పరువు తీసేలా వ్యవహరించొద్దని టీడీపీ నేతలు హితవు చెబుతున్నారు.