అది ఎర్ర బుక్కా ఎర్రి బుక్కా?

ఎర్ర బుక్ అంటే ఇన్నాళ్ళూ ఏమో కానీ ఇపుడు నారా లోకేష్ కళ్ల ముందు మెదులుతాడు. ఆయన ఎర్ర బుక్ ని అంతలా ఫ్యామస్ చేశాడు. యువగళం అంటూ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో…

ఎర్ర బుక్ అంటే ఇన్నాళ్ళూ ఏమో కానీ ఇపుడు నారా లోకేష్ కళ్ల ముందు మెదులుతాడు. ఆయన ఎర్ర బుక్ ని అంతలా ఫ్యామస్ చేశాడు. యువగళం అంటూ పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో జనాలకు గుర్తుండే విషయాలు ఎన్ని ఆయన చెప్పారో తెలియదు కానీ ఎర్ర బుక్ మాత్రం జనాలకు బాగా పట్టేసింది. అన్నీ ఎర్ర బుక్కులో రాసుకుంటున్నామని వడ్డీలతో సహా చెల్లించి తీరుతామని లోకేష్ ప్రతీ చోటా పదే పదే  హెచ్చరించారు.

ఇపుడు శంఖారావం అని మరో కార్యక్రమం తీసుకున్నారు. అయినా ఎర్ర బుక్కుని మాత్రం లోకేష్ వదలేదు. ఇచ్చాపురం నుంచి మొదలెట్టిన ఈ శంఖారావం సభలలో ఆయన మాట్లాడుతూ ఎర్ర బుక్కు రెడీగా ఉంది. అందరి జాతకాలు ఇందులో ఉన్నాయని మళ్ళీ హెచ్చరిస్తున్నారు.

అయితే వైసీపీ నేతలు చూస్తూ ఊరుకుంటారా. లోకేష్ గాలి తీసేశారు మంత్రి సీదరి అప్పలరాజు. లోకేష్ దగ్గర ఉన్నది ఎర్ర బుక్కా ఎర్రి బుక్కా అని సెటైర్ పేల్చారు. తాము తలచుకుంటే లోకేష్ ఎర్ర బుక్కుని ఎర్రి బుక్కుగా మార్చేస్తామని హెచ్చరించారు.

లోకేష్ వి అవగాహన లేని మాటలు అని మండిపడ్డారు. ఏపీలో తమ ప్రభుత్వం 5.6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయిదేళ్ళ పాలనలో చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పన విషయంలో వైసీపీనే మేలు చేసిందని మంత్రి అంటున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం తధ్యమని ఆయన జోస్యం చెప్పారు.

ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉంటూ చుట్టపు చూపుగా వచ్చే చంద్రబాబు లోకేష్ ఏపీలో అభివృద్ధి లేదు అని విమర్శిస్తున్నారని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రాలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఏడు వందల కోట్లు పెట్టి ఎత్తిపోతల పధకం ద్వారా కిడ్నీ రోగుల నియోజకవర్గాలకు తాగు నీరు ఇస్తున్నామని అలాగే 200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించామని చెప్పారు.

అదే విధంగా నాలుగు వేల కోట్ల రూపాయలతో మూలపేట వద్ద పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 350 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ పనులు జిల్లాలో సాగుతున్నాయని గుర్తు చేశారు. ఇవన్నీ అభివృద్ధి పనులు కాదా అని ఆయన ప్రశ్నించారు. లోకేష్ ఎర్ర బుక్కుకు ఇలా వైసీపీ నుంచి కౌంటర్లు స్టార్ట్ అయ్యాయి.