ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే ఫ్యూచర్ ఏమిటి అన్నది తెలియక వారి అనుచరులు కలవరపడుతున్నారు. అది కూడా రాజకీయంగా విశేష ప్రాధాన్యత కలిగిన అనకాపల్లి ప్రాంతంలో. 2019లో ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా స్థానిక డాక్టర్ సత్యవతి విజయం సాధించారు.
ఇపుడు చూస్తే అమర్నాథ్ కి అనకాపల్లి నుంచి సీటు లేకుండా పోయింది. ఆయన ప్లేస్ లో ఇంచార్జిగా మలసాల భరత్ కుమార్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని తెచ్చి పెట్టారు. ఆయనే రేపటి ఎమ్మెల్యే అన్నది వైసీపీ వర్గాల మాట. మూడవ జాబితాలోనే ఈ విషయం వెల్లడి చేసింది వైసీపీ అధినాయకత్వం. మరో మూడు విడతల జాబితాలు వచ్చాయి కానీ మంత్రి కొత్త సీటు ఏమిటన్నది తేలలేదు
గుడివాడ ఎలమంచిలి, చోడవరం, పెందుర్తి సీట్లను ఆప్షన్ గా ఉంచుకున్నారు. అయితే ఈ మూడు సీట్లలో సిట్టింగులను కదపబోవడం లేదని అంటున్నారు ఒకవేళ మార్చినా కూడా గుడివాడకు అక్కడ సీటు ఇచ్చేది లేదు అని అంటున్నారు. సర్వే నివేదికల లెక్కలు చూసుకునే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.
దాంతో మంత్రి గారు సీటు ఎక్కడో తెలియని వారు అయ్యారు. వైసీపీ రీజనల్ డిప్యూటీ కో ఆర్డినేటర్ పదవిని గుడివాడకు ఇస్తూ అధినాయకత్వం లేటెస్ట్ గా నిర్ణయం తీసుకుంది. ఈ పదవిని ఆయన కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తో పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో గుడివాడకు సీటు లేనట్లేనా అన్న అనుమానాలు ఆయన అనుచరులతో పాటు ప్రత్యర్ధులు కూడా వ్యక్తం చేస్తున్నారు.
అయితే అనకాపల్లి ఎంపీ సీటు ఆశ అయితే ఇంకా ఉంది. అక్కడ విపక్షాలు కాపు సామాజిక వర్గం నుంచి అభ్యర్ధిని నిలిపితే మాత్రం గుడివాడనే బెస్ట్ చాయిస్ గా దించుతారు అని అంటున్నారు. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే కధ ఇలా ఉంటే అనకాపల్లి ఎంపీ కధ కూడా ఇలాగే ఉంది
ఎంపీ సత్యవతికి సీటు ఈసారి లేదు అని వైసీపీ అధినాయకత్వం చెప్పకనే చెబుతోంది. పార్లమెంట్ లో యాభై రెండు సార్లు మాట్లాడి ప్రజా సమస్యలను చర్చించామని సత్యవతి అంటున్నారు. అనకాపల్లి పరిధిలో అనేక కార్యక్రమాలను సాధించామని కేంద్రంలో పెండింగులో ఉన్న వాటిని తాము తీసుకుని వచ్చామని ఆమె అంటున్నారు.
ఇలా సిట్టింగ్ ఎంపీ ఎంత చెప్పుకున్నా మరోసారి వైసీపీ ఆమెకు టికెట్ ఇచ్చేది ఉంటుందా అన్నది ఒక డౌట్ గా ఉంది. కొత్త ముఖానికే చాన్స్ అని అంటున్నారు. అలా 2019లో పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరూ కూడా ఈసారి సీటు బెంగతో ఉన్నారు అని అంటున్నారు.