ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్శీపట్నం సీటు రాజకీయంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నది. 1952లో ఏర్పడిన నర్శీపట్నం నియోజకవర్గంలో 1978 దాకా తంగేడి రాజుల హవా కనిపించింది. రాజులే మూడు దశాబ్దాల పాటు రాజ్యం చేసారు. కాంగ్రెస్ హయాంలో అనేక సార్లు ఏకపక్షంగా గెలిచి మంత్రులు కూడా అయ్యారు.
ఆ రోజులలో రెండవ పక్షంగా ఎవరు నిలబడినా అది నామమాత్రంపు పోటీ అయ్యేది. 1983లో రాజకీయం మారింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక జనాభాగా ఉన్న వెలమలు టీడీపీ అండటో రాజకీయ జెండా కట్టారు. అలా అయ్యన్నపాత్రుడు 1983లో నర్శీపట్నం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వరసగా ఆయన గెలుస్తూ వచ్చారు. 1989, 2009, 2019లలో అయ్యన్న మూడు సార్లు ఓడారు.
టీడీపీ పెట్టాక అయ్యన్న తప్ప మరో క్యాండిడేట్ టీడీపీకి లేకుండా పోయారు. ఆయన ఇప్పటికి తొమ్మిది సార్లు పోటీ చేశారు. 2024లో ఆయనకే చంద్రబాబు టికెట్ ఇస్తున్నారు. ఈ దఫా ఆయన పోటీ చేస్తే పదవసారి ఎన్నికల్లో వరసగా పోటీ చేసిన చరిత్రను కూడా సొంతం చేసుకుంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని సార్లు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజకీయ నేత ఎవరూ లేరు. బహుశా ఏపీ చరిత్రలో కూడా అలా ఒకే చోట నుంచి నిలిచి గెలిచిన నాయకుడు లేరు.
అయ్యన్న పదవసారి పోటీ చేస్తున్నారు. ఈసారి గెలవడం ఆయనకు అన్ని రకాలుగా ముఖ్యంగా ఉంది. ఆయన ఏడు పదులకు చేరువ అవుతున్న వేళ ఈసారి పోటీ చివరిదే అవుతుంది. ఈసారి గెలిస్తే తన రాజకీయ వారసత్వాన్ని కూడా నిలబెట్టుకునే వీలు ఉంటుంది. అందుకే ఆయన గెలుపుని తప్పనిసరిగా అందుకోవాల్సి ఉంది.
అయితే నర్శీపట్నంలో రాజకీయం మాత్రం టఫ్ గానే ఉంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ ఏమీ తక్కువగా లేరు. ఆయన 2014 నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో మొదటిసారి గెలిచారు. అది కూడా అయ్యన్న మీద పాతిక వేల ఓట్ల భారీ తేడాతో నెగ్గారు.
నర్శీపట్నంలో రాజకీయం రెండు పక్షాలకే పరిమితం చేయడంలో ఉమా శంకర్ విజయం సాధించారు. ఇక్కడ ఓట్ల చీలిక ఉండదు, వైసీపీకి పాజిటివ్ ఓటు ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీకి కంచుకోట నర్శీపట్నం కాబట్టి ఈసారి విజయం తమదే అని అయ్యన్న వర్గం అంటోంది. ఇద్దరూ సమ ఉజ్జీలే అయినందువల్ల ఎవరికి విజయం వరిస్తుంది అన్నది ఉత్కంఠభరితంగానే ఉంటుంది అని అంటున్నారు.
పదవ సారి గెలిచి అయ్యన్న తన ప్రతిష్టను కాపాడుకోవాల్సి ఉంది. ఒక విధంగా టీడీపీకి అయ్యన్నకు ఇది చాలా ప్రెస్టేజ్ అని అంటున్నారు.