నేను ప్రాణాలు తీసుకుంటా.. జ‌న‌సేన్ ఇన్‌చార్జ్ వైరాగ్యం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న మాట‌ల్లో చెప్ప‌లేనిది. ఎన్నో ఆశ‌ల‌తో ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీ జెండా మోస్తూ, ఆర్థికంగా చితికిపోయిన త‌మ‌కు చివ‌రికి క‌న్నీళ్లే మిగిలాయని త‌ల్ల‌డిల్లుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ్గంపేట…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న మాట‌ల్లో చెప్ప‌లేనిది. ఎన్నో ఆశ‌ల‌తో ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీ జెండా మోస్తూ, ఆర్థికంగా చితికిపోయిన త‌మ‌కు చివ‌రికి క‌న్నీళ్లే మిగిలాయని త‌ల్ల‌డిల్లుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ్గంపేట జ‌న‌సేన ఇన్‌చార్జ్ పాటంశెట్టి సూర్య‌చంద్ర త‌న‌కు టికెట్ రాక‌పోవ‌డంతో భావోద్వేగాన్ని ఆపుకోలేక‌పోతున్నారు.

మీడియా స‌మ‌క్షంలోనే క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. ఇప్పుడాయ‌న ఆమ‌ర‌ణ దీక్ష‌కు సిద్ధం కావ‌డం జ‌న‌సేన‌లో అసంతృప్తి తీవ్ర‌త‌ను ప్ర‌తిబింబిస్తోంది. టీడీపీ ప్ర‌క‌టించిన 94 మంది జాబితాలో జ‌గ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ పేరు వుంది. దీంతో టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటుండ‌గా, జ‌న‌సేన శ్రేణులు నిర‌స‌న‌కు దిగాయి.

ఈ నేప‌థ్యంలో జ‌గ్గంపేట జ‌న‌సేన ఇన్‌చార్జ్ పాటంశెట్టి సూర్య‌చంద్ర త‌న‌కు టికెట్ రాక‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ కిర్లంపూడి మండలం గోనేడ నుంచి నుంచి గోక‌వ‌రం మండ‌లం అచ్యుతాపురం వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు. ర‌బ్బ‌రు చెప్పులు వేసుకునే త‌న లాంటి సామాన్యుడు టికెట్ ఆశించ‌డం త‌గ‌దేమో అని వాపోయారు. జ‌న‌సేన కోసం ప‌ని చేయ‌డ‌మే తాను చేసిన త‌ప్పుగా ఆయ‌న భావిస్తున్నారు.

శిక్ష‌లో భాగంగా అచ్యుతాపురంలోని క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యంలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు కూచుంటాన‌ని వెల్ల‌డించారు. ఇక్క‌డే ప్రాణాలు విడుస్తాన‌ని ఆయన తేల్చి చెప్పారు. జ‌న‌సేన శ్రేణులు అంచ‌నా వేసుకున్న సీట్ల‌లో క‌నీసం స‌గం కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి. దీంతో టికెట్ ఆశావ‌హ‌లంద‌రిదీ జ‌గ్గంపేట ఇన్‌చార్జ్ ప‌రిస్థితే. అయితే కొంత మంది బాధ‌నంతా మ‌న‌సులోనే అణ‌చుకుంటుండ‌గా, మ‌రికొంద‌రు బోరుమ‌ని విల‌పిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో టీడీపీ, జ‌న‌సేన ప‌రస్ప‌రం క‌లిసిమెలిసి ఎంత వ‌ర‌కు ప‌ని చేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.